ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన విశాఖలో గెలవకపోతే సీఎం జగన్ అసెంబ్లీని రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నారా…?. అవుననే అంటున్నారు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ. వైసీపీ క్యాంప్‌లో ఆయనకు అత్యంత సన్నిహితమైన సోర్స్ ఏదో ఉందన్నట్లుగా ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా తన ఆర్టికల్‌లో విషయాలు పొందు పరుస్తూ ఉంటారు. చాలా సార్లు ముఖ్యమంత్రి నేరుగా చెప్పిన కామెంట్లన్నట్లుగా చెబుతూంటారు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికలు… విశాఖలో గెలుపు అంశంపై పార్టీ నేతలతో జగన్ అన్నట్లుగా చెబుతున్న మాటలను ఆర్కే తన “కొత్త పలుకు”లో వెల్లడించారు. దీని ప్రకారం… విశాఖలో గెలవకపోతే మంత్రులు మళ్లీ ముఖం చూపించాల్సిన అవసరం లేదని హెచ్చరించడమే కాదు… అసెంబ్లీని కూడా రద్దు చేసేస్తానన్న హెచ్చరిక కూడా అందులో ఉందని అంటున్నారు.
జగన్ అంత సీరియస్‌గా ఉండబట్టే.. విశాఖలో విజయసాయిరెడ్డి అండ్ కో అంతగా బరి తెగిస్తున్నారనేది ఆర్కే మాట. అయితే విశాఖలో ఓడిపోతే మంత్రుల్ని పీకేస్తారన్నంత వరకూ బాగానే ఉంటుంది కానీ.. తన పదవిని ఎందుకు పీకేసుకుంటారన్నది.. లాజిక్ లేని రాజకీయ వ్యాఖ్య. నిజానికి టీడీపీ నేతలు… జగన్మోహన్ రెడ్డికి అలాంటి ఆలోచనలు కల్పించడానికి కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. హైకోర్టులో ఆయన నిర్ణయాలేమీ చెల్లుబాటు కానప్పుడు… పాలనను అడ్డుకుంటున్నారన్న ఉద్దేశంతో ప్రజల వద్దకు వెళ్లాలని జగన్ అనుకున్నారని.. అందు కోసం అసెంబ్లీని రద్దు చేయాలనుకున్నారన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత స్థానిక ఎన్నికల విషయంలో గవర్నర్ వద్దకు వెళ్లిన జగన్… అసెంబ్లీని రద్దు చేస్తానని చిందులు వేశారని మాజీమంత్రి దేవినేని ఉమ ప్రకటించారు. ఆయన జగన్‌కు ప్రభుత్వాన్ని నడిపేంత ఓపిక లేదని.. ఎప్పుడైనా అసెంబ్లీని రద్దు చేస్తారని ఆయన తరుచూ అంటూ ఉంటారు.
టీడీపీ నేతల తరహాలోనే జగన్‌పై… ఆర్కే కూడా అసెంబ్లీ రద్దు మైండ్ గేమ్‌ను ఆడుతున్నారని అనుకోవచ్చు. జగన్ మోహన్ రెడ్డి … ముందూ వెనుకా ఆలోచించకుండా దూకుడు నిర్ణయాలు తీసుకుంటారు. శాసనమండలి రద్దు విషయంలోనే అతి తేలిపోయింది. ఏడాదిన్నరలోనే మొత్తం మెజార్టీ వస్తుందని తెలిసినా… మండలిపై అనేకానేక నిందలు వేసి.. అసెంబ్లీసాక్షిగా మాట్లాడి.. రద్దు తీర్మానం చేశారు. ఇప్పుడు… అదే మండలిలో తమకు మెజార్టీ వస్తుందని గొప్పగా చెప్పుకుంటున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఆ ఆవేశాన్ని.. అసెంబ్లీ రద్దు వైపు మళ్లించాలన్నట్లుగా ఆర్కే వ్యూహం ఉందన్నఅభిప్రాయం ఈ ఆర్టికల్ ద్వారా కలిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఈ సారి కొత్తపలుకులో ఆర్కే… కలిపురుషుడు చెప్పిన అంశాలను ఏపీకి అన్వయించి.. ఆసక్తికరంగా తీర్చి దిద్దారు. ఇటీవలి కాలంలో ఆయన సోషల్ మీడియాలో ట్రెండ్.. ట్రోల్ అయ్యే వాటిని తన వ్యాసాల్లో ప్రస్తావించేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మార్చారు. పురాణాల నుంచి ఓ కథను తీసుకొచ్చికి ఏపీకి లింక్ పెట్టారు. కొంత మందికి అతిశయోక్తి అనిపించినా… ఏపీలో జరుగుతున్న పరిణామాలను ప్రత్యక్షంగా చూసినవారికి… కాస్త నిజమే కదా అనిపించేలా తన ఆర్టికల్‌ను రాశారు.