ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాలు వరద రాజకీయంలో కిందామీదా పడుతూంటే.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాత్రం.. సైలెంట్‌గా… పరిపాలన ప్రారంభించారు. వరద పరిస్థితిపై ఆయన నేరుగా ఏరియల్ రివ్యూ చేశారు. హెలికాఫ్టర్‌లో వరద బాధిత ప్రాంతాలన్నిటినీ చూశారు. తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద బాధితులను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలపై… అధికారులు.. గవర్నర్‌కు.. నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వరదలు వచ్చి తగ్గిపోయే సమయంలో.. హఠాత్తుగా గవర్నర్ రంగంలోకి దిగడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యమంత్రి వరద పరిస్థితి తీవ్రంగా ఉందని తెలిసినా.. వ్యక్తిగత పర్యటన కోసం అమెరికా వెళ్లిపోవడం… పరిస్థితులకు తగ్గట్లుగా చర్యలు తీసుకోవాల్సిన మంత్రులు.. చంద్రబాబు ఇల్లు ఎప్పుడు మునుగుతుందా.. అని.. అక్కడే తచ్చాడుతూంటంతో.. పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండటానికి గవర్నర్ రంగంలోకి దిగారని చెబుతున్నారు.
నిజానికి గవర్నర్ ఇలాంటి విషయాల్లో.. సామాన్యంగా జోక్యం చేసుకోరు. ప్రధానంగా.. కేంద్రంలో ఉన్న పార్టీనే.. రాష్ట్రంలో అధికారంలో ఉంటే… ఇలాంటివి గవర్నర్ చేసినా… లైట్ తీసుకుంటారు. కానీ.. ఏపీలో బీజేపీ అధికారంలోకి లేదు. కానీ.. గవర్నర్ మాత్రం.. పరిపాలనలో యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత… బిశ్వభూషణ్.. పలు శాఖలపై సమీక్షలు చేశారు. కొత్త కాబట్టి… ఏపీ పరిస్థితిపై అవగాహన కోసం.. ఆయన అలాంటి సమీక్షలు చేశారని అనుకున్నారు. కానీ.. హరిచందన్.. రోజువారీగా.. ప్రభుత్వ పనితీరుపై ఆరా తీస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వరద పరిస్థితి తీవ్రంగా ఉన్నా… నీటిని దిగువకు వదలడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారనే ఆరోపణలు రావడం.. బాధితులకు సాయం అందడం లేదనే విమర్శలు రావడంతో.. గవర్నర్ రంగంలోకి దిగారని అంటున్నారు.
చంద్రబాబు సీఎంగా ఉంటే.. గవర్నర్ వద్దకు.. ఏపీకి చెందిన ఒక్క ప్రభుత్వ అధికారి కూడా వెళ్లడానికి సాహసించేవారు కాదు. ప్రభుత్వం కూడా.. ఏ మాత్రం.. రాజ్‌భవన్‌ను లైట్ తీసుకునేది. గవర్నర్ నరసింహన్ ఉమ్మడిగా వ్యవహరించినప్పటికీ.. తెలంగాణకు సంబంధించిన కొన్ని అంశాలపై రివ్యూ చేశారు కానీ.. ఏపీ విషయంలో మాత్రం.. అలా చేయలేకపోయేవారు. విశాఖలో జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తి దాడి జరిగినప్పుడు.. నేరుగా డీజీపీకి గవర్నర్ ఫోన్ చేశారు. అలా చేసినందుకు చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. గవర్నర్ వ్యవస్థను తీసేయాలన్నారు. కానీ… ఇప్పుడు.. గవర్నర్ నేరుగా పరిపాలనలో జోక్యం చేసుకుంటున్నారు. ఆ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఖండించే పరిస్థితి ఏపీ సర్కార్‌కు.. సీఎంకూ దాదాపుగా లేనట్లే..!