వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి పై జరిగిన కోడికత్తి దాడి కేసు ఎట్టకేలకు ఎన్ఐఏ చేతికి వెళ్లింది. నిందితుడు శ్రీనివాస్ ను విశాఖ నుంచి విజయవాడకు తరలించారు. ఎన్.ఐ.ఎ కోర్టులో శ్రీనివాస్‌ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడంతో పాటు, నిందితడు శ్రీనివాస్ ను విజయవాడ సబ్ జైలుకు తరలించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి విశాఖపట్నంలోని ఏడవ మెట్రో సెషన్స్ కోర్టు విచారణ జరిగింది. అయితే ఈ కేసు ఎన్.ఐ.ఎ పరిధిలోకి వెళ్లడంతో ఈ కేసు విచారణ ఎన్.ఐ.ఎ ప్రత్యేక కోర్టు చేపట్టింది.
విశాఖ కోర్టు పరిధి నుంచి విజయవాడ ఎన్.ఐ.ఎ కోర్టుకు బదిలీ చేయాలంటూ విశాఖ ఏడవ మెట్రో పాలిటన్ మెజిస్ర్టేట్ ను అధికారులు కోరారు. ఇందుకు సంబంధించిన పత్రాలన్నింటినీ కూడా జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఎన్.ఐ.ఎ ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. ఎన్.ఐ.ఎ. ప్రత్యేక కోర్టు విజయవాడలోనే ఉండటంతో కేసుకు సంబంధించిన పూర్తి విచారణ ఇక్కడే కొనసాగనుంది. ఈ నేపధ్యంలో ఇప్పటివరకు విశాఖపట్నం జైలులో ఉన్న నిందితుడు శ్రీనివాసరావును విజయవాడకు తరలించారు. నిందితుడు శ్రీనివాసరావును పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ ఎన్.ఐ.ఎ అధికారులు పిటీషన్ దాఖలు చేశారు. నిందుతుడి తరుపు న్యాయవాది లేకపోవడంతో కస్టడి పిటీషన్ కాపీని నిందితుడు శ్రీనివాసరావుకు అందజేశారు. కస్టడీ పిటీషన్ ను న్యాయమూర్తి పెండింగ్ లో ఉంచారు.
హైకోర్టు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయకపోయినా.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఎన్ఐఏకు కేసు అప్పగించింది. ఇది రాష్ట్ర పరిధిలో కేంద్రం చొరబడటమేనని… రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఓ దశలో కోర్టుకు వెళ్లాలన్న ఆలోచన కూడా చేసింది. కానీ… కేంద్రానికి నిరసన లేఖతో సరి పెట్టాలని నిర్ణయించుకుంది. దీంతో.. కేసు విచారణ … ఇక ఎన్ఐఏనే చేపట్టనుంది.