వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదీ కలసి రావడం లేదు. కలసి వస్తాయనుకున్న… ఘటనలన్నీ.. ఒకే సారి వస్తూండటంతో .. దేనితో ఏ తరహా రాజకీయం చేయాలో.. రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలియక కంగారు పడిపోతోంది. గత పార్లమెంట్ సమావేశాల్లో.. తెలుగుదేశంపార్టీకి ఎవరితో లింక్ పెట్టాలో అర్థం కాక .. అటు కాంగ్రెస్‌తోనూ.. ఇటు బీజేపీతోనూ లింక్ పెట్టి విమర్శలు చేసేశారు. చివరికి ఎవరూ నమ్మకుండా చేసుకున్నారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. అదే.. .కోడికత్తి కేసును… ప్రజల్లోకి తీసుకెళ్లాలా..? పధ్నాలుగు నెలల పాటు.. నడిచి.. నడిచి.. తెచ్చుకునేందుకు ప్రయత్నించిన సానుభూతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలా.. అనేది ఆ సందేహం…!
జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర..ఈ నెల తొమ్మిదో తేదీన ఇచ్చాపురంలో ముగియబోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిని ఓ మహా విజయంగా గుర్తించింది. ప్రజలందరూ గుర్తించేలా చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికే.. సాక్షి మీడియాలో దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ కు భారీగా కవరేజ్ వస్తోంది. ఓ ఐదు రోజుల పాటు.. జగన్ పాదయాత్రను.. వైఎస్ పాదయాత్రను పోల్చి… హంగామా చేసింది.. “ఈయనకు ఓటేస్తే.. ఆయనకు వేసినట్లే..” అన్న భావన తీసుకు రావడానికి… తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఈ భావోద్వేగ ప్రయాణానికి మొదట్లోనే గండి పడే పరిస్థితి వచ్చింది. అదీ కూడా కోడికత్తి కేసు కారణంగా..!. కోడికత్తి కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. నాలుగైదు రోజులు రహస్యంగా ఉంచినప్పటికీ.. హైకోర్టులో మాత్రం.. చెప్పారు. దాంతో..ఒక్కసారిగా వైసీపీతో పాటు.. ఆ పార్టీకి చెందిన మీడియా అటెన్షన్ మొత్తం అటు వైపు తిరిగింది. పాదయాత్రను మర్చిపోయింది.
కోడి కత్తి కేసులో తమను అనుకూలమైన వాదనలను.. వైసీపీ నేతలంతా వినిపిస్తున్నారు. సాక్షి మీడియా కూడా.. జగన్ పాదయాత్రకు సంబంధించిన భావోద్వేగ అంశాలకు పూర్తిగా ప్రయారిటీ తగ్గించి… కోడికత్తి కేసుకే ప్రాధాన్యం ఇచ్చింది. ఈ వేడి మరో మూడు నాలుగు రోజుల పాటు ఉండటం ఖాయమే. అదే జరిగితే.. జగన్ పాదయాత్ర కోసం.. వైసీపీ, వైసీపీ మీడియా వేసుకున్న ప్లాన్లన్నీ… ఫెయిలవ్వడం ఖాయమే. ఒకే సారి రెండు ఘటనలకు ప్రాధాన్యం ఇస్తూ.. ఇమేజ్ బిల్డింగ్ చేసుకోవడ సాధ్యమయ్యే పని కాదు. మొత్తానికే తేడా వస్తుంది. అందుకే.. ఇప్పుడు వైసీపీ ముందు ఓ పెద్ద పజిల్ ఉంది.. అది కోడికత్తి కేసును.. బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి.. జగన్ పై సానుభూతి పెంచే ప్రయత్నం చేయడమా..? లేక.. పాదయాత్రను.. హైలెట్ చేసుకుని.. అన్నొస్తున్నాడని భరోసా కల్పించుకోవడమా..? అనేదే ఆ పజిల్. దేన్ని హైలెట్ చేస్తే ఎంత ప్రయోజనం వస్తుందో.. అంచనా వేసే పరిస్థితి లేదు కాబట్టి… వైసీపీ నేతలకు… టెన్షన్ ప్రారంభమయింది. ఏ అంశాన్ని హైలటెట్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.