సామాన్యుడైనా, రాజకీయ నాయకుడైనా, సినిమా యాక్టరైనా..ఎవరైనా సరే ప్రతి వ్యక్తికీ ఓ స్టైల్ ఉంటుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికీ ఓ స్టైల్ ఉంది. ఈ స్టైల్ అనేది ఆయన హావభావాల్లోనో, ఆయన ఆహార్యంలోనో, ఆయన మాట తీరులోనో కాదు. ఆయన పనితీరులో. ముఖ్యంగా తాను ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాను అనుకొని వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక తీరులో ఓ స్టైల్ ఉంది. ఆయన పైకి ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నట్లు కనబడుతున్నా వాస్తవంగా అలా వ్యవహరించడంలేదు. ఇలా వ్యవహరించేది జగన్ ఒక్కడేనా గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలా చేయలేదా? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు.
ఆయన పత్తిత్తు అని చెప్పుకోనక్కర్లేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్నది జగన్ కాబట్టి, కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది ఆయన కాబట్టి ఆయన స్టైల్ గురించే చెప్పుకోవాలి. రాజధాని మారుతుందని సీఎం జగన్ మంత్రి బొత్స సత్యనారాయణను అడ్డం పెట్టుకొని ఎప్పటినుంచో సంకేతాలు ఇస్తూ వచ్చారు. ఈ విషయం తాను నేరుగా చెప్పకుండా బొత్స ద్వారా కంటిన్యూగా చెప్పించారు. బొత్స సంకేతాలతోనే జనంలో అనుమానాలు బయలుదేరాయి. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సూచనలు, సలహాలు ఇచ్చేందుకు జీఎన్ రావు కమిటీని వేసినట్లు కూడా బొత్సే చెప్పారు. ఈ కథ ఇలా ఉండగా శీతాకాల అసెంబ్లీ సమావేశాల చివరి రోజున జగన్ సభలో మూడు రాజధానుల గురించి బయటపెట్టారు.
మూడు రాజధానుల గురించి సూచనాప్రాయంగా చెప్పినట్లుగా అనిపించినా అప్పటికే నిర్ణయం తీసుకున్నారు. జగన్ అసెంబ్లీలో చెప్పిన వెంటనే జీఎన్ రావు కమిటీ నివేదిక అందించింది. అది జగన్ ప్లాన్‌కు అనుగుణంగానే ఉంది. అంటే జీఎన్ రావు కమిటీ నివేదిక అందించకముందే ఆయన మూడు రాజధానుల నిర్ణయం ప్రకటించారు. నివేదిక రాకముందే నిర్ణయం ప్రకటించడం అప్రజాస్వామిక చర్యేనని చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రం బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) రాజధానిపై తన నివేదికను ముఖ్యమంత్రికి అందిచబోతోంది. కాని అది తన చేతికి రాకముందే మరోసారి రాజధాని వ్యవహారంపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.
ఆయన నేరుగా మూడు రాజధానుల గురించి ప్రస్తావించకపోయినా ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో మాట్లాడిన మాటల సారాంశం మాత్రం రాజధాని మార్పు గురించే. ‘ఈ విషయం ఈ వేదిక మీది నుంచి సగర్వంగా ప్రకటిస్తున్నాను’ అని కూడా అన్నారు. జీఎన్ రావు కమిటీ రాకముందే అసెంబ్లీలో రాజధానిపై నిర్ణయాన్ని ప్రకటించగా, ఇప్పుడు బీసీజీ నివేదిక రాకముందే రాజధాని మార్పుపై క్లారిటీ ఇచ్చేశారు. అసలు ఇంకా మంత్రులు, అధికారులతో నియమించిన హైపవర్ కమిటీ నివేదిక రావల్సి ఉంది. కొన్ని రోజుల్లో అదీ చేతికందుతుంది. అది అందడానికి ముందు స్పష్టంగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఆ కమిటీల ఏర్పాటు అనేది కేవలం ప్రజాస్వామికంగా కనపించడానికేనని అర్థమవుతోంది. ఉద్యమం చేస్తున్న రైతులతో ఆయన ఇప్పటివరకు మాట్లాడలేదు. తాను నేరుగా మాట్లాడకపోయినా వారిని ఊరడించేందుకు ఒక్క ప్రకటన కూడా చేయలేదు.
నివేదికలు తయారుచేయడానికి జీఎన్‌రావు, బీసీజీ, హైపవర్ కమిటీని నియమించినట్లుగానే రైతులతో చర్చిండానికి, వారికి ఎలాంటి అన్యాయం జరగదని చెప్పడానికి, అమరావతి అభివృద్ధి గురించి వారికి తెలియచేయడానికి ఓ కమిటీని నియమించవచ్చు కదా. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలను అందచేసిన రైతులకు ప్రభుత్వ నిర్ణయంలో భాగం ఉండదా? స్టేక్‌హోల్డర్లుగా వారిని పరిగణనలోకి తీసుకోవలసిన పనిలేదా? రైతులు భూములు ఇచ్చింది ఆనాటి రాష్ట్ర ప్రభుత్వానికేగాని వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడికి కాదు కదా. సాధారణంగా కమిటీలు వేశాక వాటి సిఫార్సుల ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామిక పద్ధతి. కాని నిర్ణయాలు తీసుకున్న తరువాత కమిటీలు వేయడం జగన్ పద్ధతి. ఈరోజు జగన్ ప్రకటనతో రేపటి నుంచి ఉద్యమం ఉధృతమయ్యే అవకాశం ఉండొచ్చు.