వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇసుక, మద్యం పాలసీలను మార్చడంపై తెగ బాధపడుతున్నారు. ఇసుక తన హయాంలో అతి తక్కువకు వచ్చిందని చెప్పుకుంటూ ఒక రోజు ముందే ట్వీట్ పెట్టారు. సోమవారం తన హయాంలో మద్యం పాలసీ అత్యంత పారదర్శకంగా ఉందని ఏ మాత్రం సిగ్గుపడకుండా చెప్పుకుంటూ మరో ట్వీట్ పెట్టారు. అయితే ఆయన చాటభారతాలు రాసి పెట్టిస్తున్నారు. ఎవరు రాస్తున్నారో కానీ.. అంబటి రాంబాబు పెట్టే రెండు, మూడు వాక్యాలే కాస్త బాగుంటాయి కానీ జగన్ పెట్టే ట్వీట్‌ను చదివే తీరిక ఎవరికీ ఉండటం లేదు. కానీ ఆయన ఇసుక, మద్యంపై ఫీలవుతున్నారని ఎవరికైనా అర్థం అవుతుంది.
ఇసుక విషయంలో జగన్ రెడ్డి హయాంలో ఇబ్బందులు పడిన సామాన్యులకు.. ఇప్పుడు ఇసుక తీసుకుని వెళ్తున్న వారికి నిజం తెలుసు. అప్పట్లో పడిన ఇబ్బందులు నిర్మాణ రంగ కార్మికులకు తెలుసు. ఇంకా చెప్పాలంటే ఇసుక పేరుతో సొంత కార్యకర్తల్ని కూడా దోచుకున్నారు. ఇప్పుడు అంతా పారదర్శకంగా ఉంటే.. రవాణా చార్జీల్ని చూపించి గోల చేస్తున్నారు. తాజాగా మద్యం పాలసీ విషయంలోనూ అంతే. ఐదేళ్ల పాటు సొంత బ్రాండ్లు అమ్ముకుని వేల కోట్లు వెనకేసుకున్న జే ముఠాకు ఇప్పుడు ఆ ఆదాయం పోతుందని తెలిసి ఏడుపు ఆగుతున్నట్లుగా లేదు.
తమ హయాంలో బూమ్ బూమ్ అంత పారదర్శంగా పాలసీ ఉందని ఇప్పుడు లాటరీలు తీస్తే సిండికేట్ అంటూ.. ట్వీట్లు చేస్తున్నారు. అప్లికేషన్ల ద్వారా పద్దెనిమిది వందల కోట్లు ఆదాయం వచ్చింది. సిబ్బంది, దుకాణాల ఖర్చు ఏమీ ప్రభుత్వానికి ఉండదు. సొంత బ్రాండ్లు అమ్మరు. అన్ని రకాల మద్యం దొరుకుతుంది. ఇది పారదర్శకంగా ఉంటుందా లేకపోతే్ జగన్ రెడ్డి తన బ్రాండ్లు మాత్రమే అమ్మే… తయారీ నుంచి నగదు రూపంలో అమ్మే వరకూ మొత్తం తన గుప్పిట్లో ఉంచుకుంటే బాగుంటుందా ?. ఎంత కరుడు గట్టిన జగన్ అభిమాని అయినా ఇసుక , మద్యం విషయంలో జగన్ కు మరోసారి సపోర్టు చేయరని మార్గాని భరత్ లాంటి వాళ్లు చాలా సార్లు చెప్పారు. అందుకే వీటి విషయంలో జగన్ ఒకిటికి రెండు సార్లు ఆలోచించుకుని స్పందిస్తే బెటరేమో ?