సీఎం జగన్ లా నేస్తం పేరుతో ఓ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏపీ మొత్తం మీద ఆ పథకం లబ్దిదారులు 2 అంటే రెండు వేల మంది. వీరికి నిధులు జమ చేసేందుకు బుధవారం మీట నొక్కుతున్నారు. మొత్తం ఎంత అంటే రూ. కోటి కి కొంచెం ఎక్కువ. కానీ హాఫ్ పేజీ ప్రకటనలు అన్ని పత్రికలకు జారీ చేశారు. ఈనాడుకూ ఇచ్చారు. ఈనాడు పత్రికలో ఫ్రంట్ పేజీలో కలర్ యాడ్ హాఫ్ పేజీ ఉండాలంటే…. కనీసం అర కోటి వరకూ ఉంటుందన్న అంచనా ఉంది. ఇక సాక్షి పత్రికలో ఇంకా ఎక్కువ రేటు ఉంటుంది. ప్రభుత్వం మారాకా పలుమార్లు తమ యాడ్ రేట్లు పెంచుకున్నారు.
ఇతర పత్రికలు. .. డిజిటల్ యాడ్స్ సంగతి సరే సరి. ఎలా లేదన్నా ఈ పథకానికి ఇచ్చేది రూ. కోటి అయితే.. ప్రచారానికి రూ. నాలుగైదు కోట్ల బడ్జెట్ ఈజీగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఇటీవలి కాలంలో పథకాల లబ్దిదారుల్ని పూర్తిగా పరిమితం చేస్తోంది. అతి తక్కువ మందికి ఇస్తోంది. ఎలా చూసినా.. పథకానికి మొత్తం ఇచ్చేది రూ. కోటి నుంచి రూ. ఇరవై కోట్ల మధ్య ఉంటోంది. కానీ అంతకు మించి ఎక్కువగా ప్రచారానికి ఖర్చు పెడుతోంది. ఇలా ప్రచారానికి ఖర్చు పెట్టే బదులు అడ్డగోలుగా పెట్టిన నిబంధనలను సవరిస్తే మరింత మందికి లబ్ది చేకూరుతుందనే వాదన ఉంది.
కానీ అలాంటివి చేయడం లేదు. కోటి మంది డ్వాక్రా మహిళలకు చేయాల్సిన రుణమాఫీ విషయంలో మహిళలు ఇంకా ఎదురు చూస్తున్నారు. వేల కోట్లు అప్పులు చేసినా పథకం అమలు చేయలేకపోతున్నారు. విద్యార్థులకు ఫీజు ఎంబర్స్ మెంట్… హాస్టల్ ఫీజులు చెల్లించడం లేదు. కానీ పథకాల కు మీట నొక్కుతున్నామన్న ప్రచారానికి మాత్రం డబ్బు లోటు రానివ్వడం లేదు.