చీఫ్ సెక్రటరీ నీలం సహాని ఈ నెలాఖరుతో రిటైర్ కావాల్సి ఉంది. కొత్త సీఎస్ ఎవరా అన్న చర్చ అధికారవర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రభుత్వ పెద్దలు కూడా.. సీనియార్టీ జాబితా తీసుకుని..తమ ఆలోచనలతో ఏకీభవించేవారిని సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. అయితే.. హఠాత్తుగా సీఎం జగన్మోహన్ రెడ్డి… సీఎస్‌గా నీలం సహాని పదవి కాలాన్ని పొడిగించాలని కేంద్రానికి లేఖ రాశారు. ప్రస్తుతం… రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నాయని.. కరోనాను ఎదుర్కోవడంలో నీలం సహాని సేవలు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పొడిగింపు ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాశారు.
కొన్నాళ్ల కిందటి వరకూ.. ప్రభుత్వాల విజ్ఞప్తుల మేరకు.. కేంద్రం.. డీజీపీ, సీఎస్ లాంటి ఉన్నతాధికారుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉండేది. కానీ… ఈ విధానానికి స్వస్తి చెప్పింది. ఇటీవలి కాలంలో ఎవరికీ మినహాయిపు ఇవ్వలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కళ్లెం అజయ్ రెడ్డి .. చాలా స్వల్ప కాలం సీఎస్‌గా ఉన్నారు. ఆయనకు పొడిగింపు ఇప్పించాలని చంద్రబాబు చాలా ప్రయత్నించారు. కానీ కేంద్రం మాత్రం ససేమిరా అన్నది . దీంతో అజయ్ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు. రిటైరైన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి క్యాంప్‌నకు దగ్గరయ్యారు.
అయితే ప్రస్తుతం దేశంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కరోనా పై పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తున్న వారు రిటైరవుతున్నప్పటికీ… కేంద్రం పొడిగింపులు ఇస్తోంది. ఈ క్రమంలో ఏపీ సీఎస్ రిటైర్మెంట్ వ్యవహారాన్ని కూడా ప్రత్యేకంగా తీసుకుని .. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పొడిగింపు ఇస్తారని భావిస్తున్నారు. నిజానికి.. నీలం సహాని.. కొంత కాలంగా… ఏపీ ప్రభుత్వ పెద్దల తీరుపై అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. తన పేరుతో ఇస్తున్న ఆదేశాలు తనకు తెలియకుండానే వస్తున్నాయని.. అంతా సీఎం పేషిలోని ఓ అధికారి చేస్తున్నారన్న అసంతృప్తి ఆమెలో ఉందంటున్నారు. అయితే.. ఇప్పుడు ఆమె ఆ అసంతృప్తిని సర్దుబాటు చేసుకుని పదవిలో కొనసాగాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.