“చంద్రబాబుకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐదుగుర్ని లాగేస్తే పదిహేడో.. పద్దెనిమిది మందో ఎమ్మెల్యేలు ఉండరు.. ఆయనకు ప్రతిపక్ష నేత స్టేటస్ కూడా ఉండదు..” అని అసెంబ్లీ జగన్ రెడ్డి అహంకారంతో మాట్లాడిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు మరింత ఎక్కువగా అవుతున్నాయి.. దీనికి కారణం తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ ఆయన స్పీకర్‌కు రాసిన లేఖ. ఒకప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా పీకేందుకు ప్రయత్నం చేసి చేత కాక కూర్చున్న ఆయన ఇప్పుడు తనకు ప్రజలు పీకేసిన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని .. రుబాబుగా బతిమాలుకునే స్థితికి వచ్చారు.
అధికారం ఉన్నప్పుడు అహంకారం నెత్తి మీదకు ఎక్కితే.. పాతాళంలోకి పడిపోవడానికి ఎంతో కాలం పట్టదని.. జగన్ ను చూస్తే అర్థమవుతుంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రతి తప్పుడు పనికి ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. తాను అలా ప్రవర్తించానని తెలిసి కూడా.. మనసులో దాచి పెట్టుకుని లేఖలు రాయాల్సిన దుస్థితికి వచ్చింది. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ప్రజలు ఇవ్వలేదు. కానీ టీడీపీకి ఇవ్వడానికి అవకాశం ఉంది.కానీ జగన్ రెడ్డి లాంటి నాయకుడికి పాలుపోస్తే.. అది తమనకే కాటు వేస్తుందని టీడీపీ నేతలకు తెలియకుండా ఉంటుందా ?
చట్టంలో లేకపోపోయినా.. పదిశాతం సభ్యులు లేని పార్టీని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటే… కేవలం స్పీకర్ చేతిలో మాత్రమే ఉంది. 2014, 19 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదు. అందుకే ప్రధాన ప్రతిపక్ష నేత లేకుండానే పదేళ్లు దేశం రాజకీయం చూసింది. ఇప్పుడు ఏపీ కూడా చూస్తుంది. హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ మొండి పట్టుకుపోలేదు. ఎందుకంటే.. దాని వల్ల పరువు మాత్రమే పోతుంది కానీ హోదా రాదని తెలుసు. ఇప్పుడు జగన్ ది కూడా అదే పరిస్థితి.
దేవుడి స్క్రిప్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. ప్రజలు ఇచ్చిన అధికారంతో అహంకారంగా ప్రవర్తిస్తే..రిటర్న్ స్క్రిప్ట్ ఇంకెంత ఘోరంగా ఉంటుందో జగన్ కు ఇప్పుడైనా అర్థమవుతుందో లేదో