ముఖ్యమంత్రి జగన్ రాత్రి పది గంటల తర్వాత ఢిల్లీలో అపాయింట్మెంట్లు ఖరారు చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో హోంమంత్రి అమిత్ షాను కలుస్తారు. లోపల అధికారులు ఉండరు. పార్టీకి చెందిన ముఖ్య నేతలతో వెళ్తారు. ఆ ముఖ్య నేతలు కూడా భేటీలో ఉంటారో లేదో తెలియదు. కానీ అలా భేటీ ముగియగానే ఇలా ప్రెస్ నోట్ విడుదలవుతుంది. అదేమిటంటే… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.. కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారితో సమావేశమయ్యారు. పోలవరం నిధులు విడుదల చేయాలని ప్రత్యేకంగా వినతి పత్రం ఇచ్చారు అనేది.. ఆ ప్రెస్ నోట్ సారాంశం. జగన్ మీడియాలోనూ ఇది హైలెట్ అవుతుంది. అంత వరకూ బాగానే ఉంది. అయితే నిజంగా సీఎం జగన్.. హోంమంత్రిని పోలవరం నిధులు అడిగారా… ఒక వేళ అడిగితే.. పోలవరం నిధులకు .. హోంమంత్రికి సంబంధం ఏమిటి అనే మౌలికమైన ప్రశ్నలకు సహజంగా సమాధానం దొరకదు.
కానీ ఇప్పుడు వైసీపీ ఎంపీ పుణ్యమా అని అసలు విషయం బయటకు వచ్చింది. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓ ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానంగా… జగన్మోహన్ రెడ్డి అసలు పోలవరం ప్రాజెక్టు కోసం హోంమంత్రి అమిత్ షాను నిధులు అడగలేదని అందుకు సంబంధించిన విజ్ఞాపనపత్రం ఏదీ కూడా.. ఆయనకు అందలేదని క్రిస్టల్ క్లియర్గా వివరిస్తూ సమాధానం పంపారు. దీంతో వైసీపీ నేతలకే కాదు.. సీఎం ఢిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారని నమ్ముతున్న వారందరికీ మైండ్ బ్లాంక్ అయింది. అసలు పోలవరం నిధులను జగన్ అడగలేదని కేంద్రం తేల్చిన తర్వతా ఇక సమర్థించుకోవడానికి చాన్స్ ఎక్కడ ఉంటుంది.
టీడీపీ నేతలు ఇప్పటికే జగన్ లోపల మాట్లాడేది కేసులు గురించేనని.. బయట మాత్రం.. రాష్ట్ర ప్రయోజనాల కోసమని చెబుతూంటారని.. విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు వారి విమర్శల్లో నిజం ఉన్నట్లుగా కనిపిస్తోంది. నిజంగా జగన్ కేంద్రానికి లేఖలు రాసి.. విజ్ఞాపనపత్రాలు ఇచ్చి ఉంటే.. అవి ఖచ్చితంగా ఆయా శాఖల రికార్డుల్లో ఉంటాయి.. కేంద్రమంత్రి తమ వచ్చిన విజ్ఞాపన పత్రాల గురించి చెప్పేవారు. సీఎం అడగలేదు కాబట్టే ఇవ్వలేదని చెబుతున్నారు. మొత్తానికి ఈ సారి జగన్ ఢిల్లీకి వెళ్లి పది గంటల తర్వాత అమిత్ షాతో మాట్లాడి బయటకు వస్తే.. విడుదల చేసే ప్రెన్నోట్ విషయంలో ఆర్టీఐ చట్టాల కింద.. వివరాలు తీసుకోవడానికి ఇతరులు పోటీ పడే అవకాశం ఉంది.