ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం విధానం సత్ఫలితాలు ఇస్తోంది. మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. 2018 అక్టోబర్ లో 32లక్షల 28వేల 366 కేసుల లిక్కర్ ను విక్రయించగా … ఈ ఏడాది అక్టోబర్లో 23లక్షల 60వేల 89కేసుల మద్యం మాత్రమే అమ్మారు. దీంతో 27శాతం మేర మద్యం అమ్మకాలు తగ్గుదల నమోదు చేసుకున్నాయి,. బీరు అమ్మకాలు 2018 అక్టోబర్ లో 23లక్షల 86వేల 397కేసులు అమ్మడుపోగా, ఈ ఏడాది అదే మాసంలో 10 లక్షల 40వేల 539కేసులు మాత్రమే విక్రయించారు. దీంతో 56.4శాతం బీర్ల అమ్మకాల తగ్గుదల నమోదైంది. నూతన మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో గతంలో ఉన్న 4వేల 380 మద్యం షాపులను 3వేల 500లకు తగ్గించారు. అటు బిజినెస్ సమయాన్ని ఉదయం 11గంటల నుంచి రాత్రి 8గంటల వరకు పరిమితం చేశారు.
కొత్త మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో అమ్మకాలు తగ్గాయని, ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం లేకపోవడం సమయాన్ని సక్రమంగా పాటించడంతో మద్యం క్రమక్రమంగా నియంత్రణలోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. గతంలో పర్మిట్ రూములతో కొన్నిచోట్ల, పర్మిట్ లు లేకుండా మరికొన్నిచోట్ల మద్యం సేవించేవారు. ఇప్పుడు పర్మిట్ రూములను రద్దు చేయడంతో మద్యం షాపులు కేవలం అమ్మకానికి మాత్రమే పరిమితమవుతున్నాయన్నారు. గ్రామాలలో కూడా బెల్ట్ షాపులను ఎక్సైజ్ అధికారులు, పోలీసులు సమన్వయంతో తొలగించడంతో గ్రామాలలో మద్యం వినియోగం భారీగా తగ్గింది. అటు గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా బెల్ట్ షాపుల ద్వారా అక్రమ మద్యం విక్రయాలకు అవకాశం లేకుండా నిఠా పెట్టడంతో గ్రామాలలో మద్యం తగ్గిందంటున్నారు.
అయితే మద్యం విధానం వల్ల ఆదాయం మాత్రం తగ్గలేదు. భారీగా రేట్లు పెంచడంతో.. ప్రభుత్వానికి ఆదాయం అలాగే వస్తోంది. సరిహద్దు జిల్లాల్లో చాలా మంది పొరుగు రాష్ట్రాల్లో చవకగా దొరికే మద్యం తాగేసి వస్తున్నారు. షాపుల్లో బీర్లు పెట్టేందుకు ఫ్రిజ్లు ఏర్పాటు చేయలేదు. దాంతో బీర్లు తాగేవారు తగ్గిపోయారు. ఎలా చూసినా.. మద్యం వినియోగం మాత్రం… తగ్గిందని.. ప్రభుత్వ వర్గాలు గట్టిగానే చెబుతున్నాయి.