ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లో.. అన్ని పథకాలకు వైఎస్ఆర్ పేరు పెట్టేవారు. పెన్షన్ల పథకానికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని.. ఆరోగ్యశ్రీకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ రైతు భరోసా అని పేర్లు పెట్టారు. చివరికి విద్యార్థులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాలకు.. అబ్దుల్ కలాం పేరు ఉంటే.. దాన్ని తీసేసి.. వైఎస్ఆర్ పేరు పెట్టాలనుకున్నారు. వివాదం అవడంతో.. అబ్దుల్ కలాం పేరే ఉంచారు.. అది వేరే విషయం. అయితే.. కొద్ది నెలలుగా.. వైఎస్ఆర్ పేరు ఏ పథకానికీ పెట్టడం లేదు. కానీ అనేక పథకాలు ప్రారంభమవుతున్నాయి. వాటన్నింటికీ… పేర్లు పెడుతున్నారు కానీ.. ఎక్కడా వైఎస్ ముద్ర కనిపించడం లేదు.
వైసీపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమ్మఒడి పథకం దగ్గర్నుంచి ఈ ట్రెండ్ ప్రారంభమయింది. మొదట్లో అమ్మఒడి పథకానికి జగన్మోహన్ రెడ్డి తన పేరు పెట్టేందుకు అంగీకరించలేదని.. మంత్రులందరం.. పట్టుబట్టి ఒప్పించామని.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. దానికి జగనన్న అమ్మ ఒడి అని పేరు పెట్టారు. ఆ తర్వాత ప్రారంభమవుతున్న ప్రతీ పథకానికి జగనన్న అనే పేరు కామన్ అయిపోయింది. చిన్న పిల్లలకు .. మధ్యాహ్న భోజనం పథకం ఎప్పటి నుంచో ఉంది. దానికి కొత్త మెనూ పెడుతున్నామని చెప్పి.. ఆ పేరును.. జగనన్న గోరుముద్ద అని పేరు మార్చేశారు. ఆ తర్వాత విద్యార్థులకు ఫీజురీయింబర్స్పథకానికి జగనన్న విద్యా దీవెన… స్కాలర్ షిప్లు.. ఇచ్చేందుకు జగనన్న వసతి దీవెన అని పేర్లు పెట్టారు. ఇలా ప్రతి పథకానికి జగనన్న పేరు కామన్ అయిపోతూ వస్తోంది.
టీడీపీ హయాంలో… ఎక్కువ పథకాలకు ఎన్టీఆర్ పేర్లు పెట్టేవారు. అయితే.. చంద్రబాబు కూడా.. తర్వాత తన పేరును పథకాలకు జోడించుకోవడం ప్రారంభించారు. చంద్రన్న బీమా లాంటి పథకాలకు రూపకల్పన చేశారు. ఇప్పుడు అదే దారిలో.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తున్నారు. తనకంటూ.. కొన్ని ప్రత్యేకమైన సంక్షేమ పథకాల ఇమేజ్ రావాలని.. జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని.. అందు కోసమే… ఇలా పథకాలకు తన బ్రాండ్ వేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై వైసీపీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నా… బయటకు వ్యక్తం చేసే పరిస్థితి మాత్రం లేదు.