వై.యస్. రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన నాయకుడు. నాయకుడిగా వైయస్సార్ ఎదుగుదలలో కాంగ్రెస్ పార్టీ తోడ్పాటు ఎంత వుందో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వైయస్సార్ తోడ్పాటూ అంతే వుంది. కాంగ్రెస్ పార్టీని, వై.యస్. రాజశేఖరరెడ్డిని వేరు చేసి, విడదీసి ఎవరూ చూడలేరు. వైయస్సార్ తనయుడు వై.యస్. జగన్ వేరు చేయడానికి, విడదీయడానికి సినిమా ద్వారా ప్రయత్నిస్తున్నట్టు వుంది ‘యాత్ర’ ట్రైలర్ చూస్తుంటే. ప్రస్తుతం జగన్ కాంగ్రెస్ పార్టీలో లేరు. తండ్రి మరణం తరవాత సొంత కుంపటి పెట్టుకున్నారు. తండ్రి చేసిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమాలో కాంగ్రెస్ పార్టీని ఎక్కువ చేసి చూపిస్తే.. వచ్చే ఎన్నికల్లో తనకు చేటు చేస్తుంది. అందుకని తండ్రిని, కాంగ్రెస్ పార్టీని విడదీయడానికి సినిమాతో ప్లాన్ చేసినట్టున్నారు.
‘రాజశేఖరా… నువ్వు మారావని నేను నమ్ముతున్నాను. ఈసారి నా ఓటు నీకే, నీ పార్టీకి కాదు’ అని ట్రైలర్లో రైతు పాత్రధారి నాగినీడు ద్వారా ఓ డైలాగ్ చెప్పించారు. అప్పట్లో రాజశేఖరరెడ్డిని చూసి ప్రజలు ఓట్లు వేశారు తప్ప… కాంగ్రెస్ పార్టీని చూసి కాదని చెప్పకనే చెప్పారు. ‘యాత్ర’ టీజర్ పాదయాత్రలో వున్న జగన్‌కి చూపించి విడుదల చేశారు. ట్రైలర్ కూడా ఆయనకు చూపించే విడుదల చేసి వుంటారు. ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం, ప్రజల్లో రాజశేఖరరెడ్డిపై ప్రేమను మరోసారి బయటకు తీయడం కోసం జగన్ ‘యాత్ర’ తీస్తున్నారని ప్రచారంలో వుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం మైలేజ్ వచ్చినా ప్రమాదమే. అందుకని తగిన జాగ్రత్తలు తీసుకున్నార్ట. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అంపశయ్యపై వుంది. ఆ పార్టీకి కొద్దో గొప్పో క్యాడర్ మిగిలి వుంటే అది కూడా తనకు దక్కేలా జగన్ ప్లాన్ చేశారేమో!?