ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి విశాఖ నగరానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. శారదా పీఠానికి వెళ్లి… స్వామి స్వరూపానందను దర్శించుకున్నారు. అత్యంత శ్రద్ధాసక్తులతో ఆయనకి పెద్ద ఎత్తున దక్షిణ తాంబూలాది కానుకలను అందించి, ముకుళిత హస్తాలతో భక్తిని చాటుకున్నారు! పాదయాత్ర దగ్గర్నుంచీ, ఎన్నికల్లో నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్త నిర్ణయం, అంతకుముందు తెలంగాణ సీఎం కేసీఆర్ కి చేసిన తరహాలోనే జగన్మోహన్ రెడ్డికి కూడా ఓ పెద్ద యాగం చేయడం… ఇలా ఆధ్యాత్మికంగా ఆయన జగన్ కు గురుస్థానంలో నిలబడి రాజకీయ దిశానిర్దేశం చేశారనే చెప్పాలి! అందుకే, తన భక్తిప్రపత్తులను అదే స్థాయిలో జగన్ చాటుకున్నారనీ చెప్పాలి. సహజంగా స్వామీజీలూ భక్తులను ఆలింగనాలు చేసుకుంటూ కనిపించే దృశ్యాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. కానీ, స్వరూపానంద మాత్రం జగన్ ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యం ప్రత్యేకంగా నిలిచింది. అంతేకాదు, జగన్ ను కాసేపు అలా పట్టుకుని… చెవిలో ఏదో చెప్పారు స్వామీజీ!
ఇది జగన్మోహన్ రెడ్డి ఆధ్యాత్మిక పర్యటనే అయినా… స్వామీజీతో రాజకీయాలకు సంబంధించిన కొంత చర్చ కూడా జరిగినట్టు సమాచారం. ఎందుకంటే, వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ స్వామీజీకి రాజకీయ భక్తుల తాకిడి ఆమాంతంగా పెరిగిపోయిన పరిస్థితిని చూశాం. మంత్రి పదవులు ఆశిస్తున్నవారు ముందుగా సీఎం జగన్ ను కలిసే కంటే…. వయా స్వామీజీ ద్వారా ఓ మాట సాయం చేయించుకునే ప్రయత్నంలో వైకాపా ఎమ్మెల్యేల్లో చాలామంది ఓ దఫా దర్శనాలు చేసుకుని వచ్చేశారు. అయితే, తనకి ఫలానాది కావాలని తన భక్తులను కోరనంటూ ఆశ్వావహులకు కొంత తత్వబోధ చేశారు. దాంతో వారికి కొంత నిరాశే మిగిల్చారు స్వామీజీ!
మొత్తానికి, ఒకేసారిగా తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పవర్ ఫుల్ స్వామీజీగా స్వరూపానంద ఇప్పుడు పాపులర్ అయ్యారనడంలో సందేహం లేదు! తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ మధ్య వైజాగ్ స్వామీజీ ఆశీస్సుల కోసమే మొగ్గు చూపుతున్న సంగతీ తెలిసిందే. ఇద్దరు ముఖ్యమంత్రులూ తన శిష్యులనీ, తన ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చారంటూ ఆనందంగా చెప్పుకోగలిగే స్వామీజీగా ప్రస్తుతం ఈ స్వామి కనిపిస్తున్నారు!