ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను వెల్లువలా ప్రకటిస్తోంది. వాటిని ఎలా డిఫెండ్ చేయాలో తెలియక.. వైసీపీ.. అవన్నీ తమ పథకాలేనని.. చంద్రబాబు కాపీ కొట్టారని… ఆ క్రెడిట్ అంతా.. జగన్మోహన్ రెడ్డికేనని వాదిస్తోంది. జగన్ వాదనను.. ఎవరైనా పట్టించుకుంటారో లేదో కానీ.. తాజాగా.. ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మాత్రం.. వైసీపీని అనుమానంతో చూసేలా చేసింది.
టీడీపీలా బీసీ సభ పెట్టాల్సిందేనంటున్న జగన్..!
రాజమండ్రిలో .. తెలుగుదేశం పార్టీ భారీగా.. జయహో బీసీ సభను నిర్వహించారు. చంద్రబాబు భారీ ఎత్తున తాయిలాలు ప్రకటించారు. ఈ సభను చూసి వైఎస్ జగన్మహోన్ రెడ్డి ఉలిక్కి పడ్డారేమో కానీ.. వెంటనే.. పార్టీకి చెందిన ప్రముఖ బీసీ నేతలందర్నీ.. హుటాహుటిన హైదరాబాద్కు పిలిపించారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కూడా.. ఓ బీసీ గర్జన నిర్వహించాలని… నిర్ణయించడానికి ఈ సమావేశం అన్నమాట. టీడీపీ జయహో బీసీ నిర్వహించిన తర్వాతి రోజే.. బీసీ నాయకుల్ని పిలిపించి.. తామూ సభ ఏర్పాటు చేస్తామని చెబితే.. నవ్వుల పాలవుతామని… వాళ్లను అనుకరించినట్లు ఉంటుందని.. పార్టీ నేతలు గొణుక్కున్నా.. జగన్మోహన్ రెడ్డి వినలేదు. పార్టీలో ముఖ్యమైన బీసీ నేతలు జంగా కృష్ణమూర్తి, బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, పార్థసారథి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను పిలిపించి.. భారీ మేథోమథనం జరిపినట్లు .. ఫోకస్ చేసి.. తర్వాత ప్రెస్మీట్ పెట్టి.. అసలు విషయం చెప్పారు. అదేమిటంటే… ఫిబ్రవరి 19వ తేదీన ఆంధ్రప్రదేశ్లో బీసీ గర్జన నిర్వహిస్తున్నామని… హైదరాబాద్ గడ్డ మీద నుంచి సగర్వంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా.. ఏమిటి.. ఎలా .. అన్న అంశాలపై… విడిగా నిర్ణయం తీసుకుంటారు. నిన్నటి వరకైతే.. సభ నిర్వహించాలని డిసైడ్ చేశారు.
టీడీపీలా తాయిలాలు ఇవ్వాల్సిందేనంటున్న జగన్..!
జయహో బీసీకి తగ్గట్లుగా.. సభ నిర్వహించినా .. నిర్వహించకపోయినా… చంద్రబాబు ప్రకటించిన దాని కన్నా భారీగా వరాలు ప్రకటించాలని… నిర్ణయించారు. ఈ మేరకు కసరత్తు కూడా ప్రారంభించారు. ఇప్పటికే… చంద్రబాబు… దూకుడుగా ఉన్నారని.. తాము వెనుకబడిపోయామన్న ఆలోచనలో వైసీపీ నేతల ఉన్నారు. ఇప్పటి వరకూ నవరత్నాలుగా ప్రచారం చేసుకుని.. వాటితో ఓట్లు సాధిద్దామనుకున్నారు కానీ.. ఆ రత్నాలను చంద్రబాబు ముందుగానే ప్రజలకు పంచి పెట్టేశారు. దాంతో వైసీపీకి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ మిగలకుండా పోయింది. ఇప్పుడు పోటాపోటీగా.. చంద్రబాబు ఏది ఇస్తే.. దానికి రెండింతలు ఇస్తానని చెబితే.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకే… ఏం చేయాలన్న మేథోమథనం వైసీపీలో నడుస్తోంది. అయితే.. వైసీపీ జగన్మోహన్ రెడ్డి తప్ప.. ఎవరూ మేథావులు ఉండే అవకాశం లేదు కాబట్టి.. ఆ మథనం జగనే చేస్తున్నారు. ఆయనే కొన్ని పథకాలు రచించి… బీసీ గర్జనలో ప్రకటించే అవకాశం ఉంది.
మరి టీడీపీలా బీసీ నేతలకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వరు..?
జగన్కు బీసీ నాయకుల మీద ఎంత ఇష్టం ఉందో.. ఆయన వారిని ఎలా ప్రొత్సహిస్తారో.. సమావేశానికి వచ్చిన నేతలను చూస్తేనే అర్థమైపోతుంది. గొప్ప బీసీ నేతలుగా చెప్పి.. వారికి పార్టీ పదవులు అప్పగించిన జగన్.. ఆర్థికంగా బలహీనంగా ఉన్నారని.. వారిలో ఎక్కువ మందికి ఇప్పటికే టిక్కెట్లు లేవని స్పష్టం చేశారు. వైసీపీ బీసీ వింగ్ కు అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న జంగాకృష్ణమూర్తి గురజాల మాజీ ఎమ్మెల్యే. ఆయన యరపతినేనిని ఆర్థికంగా ఎదుర్కోలేరని చెప్పి..కాసు మహేష్ రెడ్డిని ఇన్చార్జ్గా వేసి.. ఆయనకే టిక్కెట్ అని ప్రకటించారు. ఇంకో బీసీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్కు.. జగన్ పెట్టిన టార్చర్ అంతా ఇంతా కాదు. టిక్కెట్ ఇవ్వకపోవడమే కాదు..పార్టీ నుంచి పొమ్మని పొగ పెట్టారు కూడా. ఇంకో బీసీ నేత మోపిదేవి వెంకటరమణ.. జగన్ దెబ్బకు జైలు పాలయి మానసిక క్షోభ అనుభవించారు. ఇంతకు ముంచిన బీసీ నేతలు… వైసీపీలో లేరు. ఉన్న వాళ్లకి జగన్ టిక్కెట్లివ్వరు. కానీ.. బీసీలను మాత్రం ఉద్దరించేస్తానని చెబుతూంటారు.