గవర్నర్ నరసింహన్ హఠాత్తుగా విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. ఆయనను సీఎం జగన్ హుటాహుటిన కలిశారు. వీరి మధ్య గంటన్నర పాటు చర్చలు జరిగాయి. పదకొండో తేదీన అసెంబ్లీ సమావేశాలున్నందున… గవర్నర్ వచ్చారని అందరూ అనుకున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో.. ఉభయసభలను ఉద్దేసించి ప్రసంగించే కార్యక్రమం గవర్నర్ కు లేదు. అయినా ఆయన హఠాత్తుగా విజయవాడకు వచ్చారు. జగన్ తో గంటన్నర చర్చలు జరిపారు. ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. సోమవారం సాయంత్రం వరకు చెన్నైలో ఉన్న గవర్నర్ నరసింహన్.. హఠాత్తుగా విజయవాడకు వచ్చారు. ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చి బందరు రోడ్ లో ఓ హోటల్ లో దిగారు. గవర్నర్ వచ్చిన కాసేపటికే సీఎం ఆ హోటల్ కు వచ్చారు. సుమారు గంటన్నరసేపు ఇరువురి మధ్య కీలక భేటీ జరిగింది. ఆ తర్వాత గవర్నర్ ఇంకెవర్నీ కలవలేదు. సీఎంతో భేటీ మినహా అధికారిక కార్యక్రమాలు ఏవీ కూడా పెట్టుకోలేదు.
పదే పదే పొడిగింపులు పొందుతున్న గవర్నర్ నరసింహన్ పదవీ కాలం బుధవారంతో ముగియనుంది. మరోసారి పొడిగింపు ఉత్తర్వులు ఇంకా రాలేదు. ఆయనను కొనసాగించడం లేదని.. క్లారిటీ ఇప్పటికే ఉంది. ఈ తరుణంలో అధికారికంగా పదవీ కాలం ముగియడానికి ఒక్కరోజు ముందే విజయవాడ వచ్చారు. ఇటీవలి కాలంలో గవర్నర్ కొన్ని విషయాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించారు. పదిరోజుల క్రితం హైదరాబాద్ లోని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసంలో కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ, వివాదాల పరిష్కారం ఇరు రాష్ట్రాల సీఎంలు అధికారులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ లో ఉమ్మడి ఆస్తుల విభజనపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం గవర్నర్ వద్ద జరుగుతుందని భావించినప్పటికీ అది వాయిదా పడింది.
రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి నడుస్తున్న తరుణంలో మారుతున్న రాజకీయపరిస్థితులపై గవర్నర్ – జగన్ చర్చించినట్లుగా ప్రచారం జరుగుతోంది. గవర్నర్ నరసింహన్ విభజన సమస్యలతోపాటు మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొన్ని సూచనలు చేసుంటారని చెబుతున్నారు. అయితే అసలు ఎజెండా ఏమిటోమాత్రం.. బయటకు తెలియనివ్వడం లేదు.. ఊరకనే రారు మహానుభావులన్నట్లు.. గవర్నర్ విజయవాడ పర్యటన…కొత్త చర్చలకు కారణం అవుతోంది.