రాజకీయాల్లో వ్యూహాలను రహస్యంగా ఉంచుకోవాలి. చాకచక్యంగా వ్యవహరించాలి. అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటూనే పార్టీని నడుపుకోవాలి. ప్రత్యర్థి ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పథకాలు పన్నాలి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరిగ్గా దీనికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. మొట్టమొదటి తప్పిదం.. తన వ్యూహకర్తను బహిర్గతం చేయడం. ఆపై తాను అధికారంలోకి వస్తే ఏం చేయదలచుకున్నాడో రెండేళ్ళు ముందుగానే చెప్పేయడం. ఇలా చెప్పడమే వ్యూహమనుకుంటున్నారు వైయస్ఆర్ కాంగ్రెస్ సలహాదారులు.
ప్రజాధన దుర్వినియోగంపై దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే అవగాహన వస్తున్న తరుణంలో ఆ వర్గానికి ఇంతనీ, వీరికి అంతనీ హామీలు గుప్పించేయడం చారిత్రక తప్పిదమే.
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ రెండురోజుల్లో తాము ప్రజా ప్రయోజనాలను కాపాడడానికి తామేం చేశామో చెప్పడం మాని, ముఖ్యమంత్రి చంద్రబాబుపై విషం కక్కడానికీ, అసభ్యంగా దూషించడానికీ ప్రాధాన్యమిచ్చారు. వేదికెక్కి మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఇదే వైఖరిని ప్రదర్శించారు. ఎమ్మెల్యేలు కొడాలి నాని, రోజా ఈ అంశంలో చాలా ముందున్నారు. కొడాలి నాని అయితే ఏకంగా చంద్రబాబు గురించి, అనకూడని మాటలు కూడా అన్నారు. సభ్యతా సంస్కారాలను మరిచారు. సభ్య సమాజంలో ఉంటున్నామా అనే అనుమానమొచ్చింది ఆయన ప్రసంగం వింటుంటే. వారి వ్యక్తిగత ద్వేషాలకు ప్లీనరీని వేదిక చేసుకుని మాట్లాడారు. ఈ అంశాన్ని జగన్ గానీ, ఆయన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గానీ గమనించుకోలేకపోయారు. ప్రత్యర్థిని తిట్టిన వారిని చంక ఎక్కించుకునే నాయకుడిగా వ్యవహరించారు. ప్రశాంత కిషోర్‌కు తెలుగు రాదు కాబట్టి అర్థం కాదు. పార్టీలో పెద్ద మనుషులైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి వారు అలా చేయకూడదని చెప్పవచ్చుగా. చెప్పలేదు. ఎందుకంటే వారి ప్రయోజనాలను వారు కాపాడుకోవాలి. స్వప్రయోజనాల కోసం పార్టీని నిలువునా ముంచేస్తున్నారు.
వచ్చేసారి మనదే అధికారమనే మత్తులో జగన్మోహన్రెడ్డిని వారు సమ్మోహితుల్ని చేస్తున్నారు. దీన్నుంచి ఆయన బయటపడలేకపోతున్నారు. సోషల్ మీడియాలో చంద్రబాబునూ, ఆయన కుమారుడు లోకేశ్‌ను డీ ఫేమ్ చేయడానికి ప్రయత్నించారు. పిల్లి అయినా సరే గదిలో వేసి, కొడితే తిరగబడి గుడ్లు పీకేస్తుంది. అధికారంలో ఉన్న వారు ఊరుకుంటారా.. తమ అధికారాన్ని ఉపయోగించి, కేసులు పెట్టారు. అయినా వారి వైఖరిలో మార్పు రాలేదు. ఈ అంశాన్ని పక్కనపెడితే…ఈరోజు ముగిసిన వైయస్ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు ఎన్నికల ప్రచార సభను తలపించాయి. హామీల వర్షం కురిసింది. పాదయాత్రకూ తేదీ ప్రకటించారు. ప్రజలకు దగ్గరగా మెలగాలి.. వారి ఆదరాభిమానాలను చూరగొనాలి తప్ప.. ప్రలోభ పెట్టడం ద్వారా అధికారంలోకి వచ్చేస్తామనుకోవడం సమంజసం కాదేమో. రైతులను ఆదుకోవడాన్ని ఎవరూ తప్పపట్టరు. అది హేతుబద్ధంగా ఉండాలి. ప్రజాధనంతో అలవి కాని హామీలిచ్చి, అధికారంలోకి రావలనుకోవడం కల్ల. అలవి కాని హామీలను ఇచ్చి 2014లో అధికారానికి దూరంగా ఉన్నామని చెప్పుకుంటున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సన్న, చిన్నకారు రైతులకు 50వేల రూపాయల చొప్పున చేతికి ఇస్తామనడాన్ని ఏ విధంగా తీసుకోవాలి?
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి