ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ఆ వ్యూహాల్లో తాము బలపడటమే కాదు.. ఇతర పార్టీలను బలహీనం చేయడం కూడా అందులో భాగం. ఇప్పుడు.. ఏపీ రాజకీయాల్లో అదే జరుగుతోంది. అటు చంద్రబాబు.. ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా.. జనసేన పార్టీని గురి పెట్టారు. ఆ పార్టీ ప్రభావం తమపై పడకుండా.. విభిన్నంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈ వ్యూహాలు ఇద్దరివీ భిన్నమైనవి. పవన్ కల్యాణ్ మావాడేనన్నట్లుగా చంద్రబాబు ఫీలర్లను.. జనంలోకి పంపే ప్రయత్నం చేస్తూడంగా…పవన్ కల్యాణ్ చంద్రబాబు పార్టనరేనంటూ… జగన్, సాక్షి మీడియా ప్రచారం ప్రారంభించేశారు. రెండూ చూడటానికి ఒకలాగే ఉన్నా… హస్తిమశకాంతంరం ఉంది. దీన్ని పవన్ కల్యాణ్ అర్థం చేసుకుంటారా..?
పవన్ కలుస్తాడని చంద్రబాబు చెప్పారా..?
మీడియా సమావేశంలో.. ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు.. ఊహాజనిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వను అని మాత్రమే… చంద్రబాబు చెప్పారు. ఇదే.. పెద్ద పజిల్ లాంటి సమాధానం. అసలు.. పవన్ కల్యాణ్ ఓ వైపు ఘోరంగా విమర్శలు చేస్తూంటే.. కలసి పని చేసే ప్రశ్నే లేదని .. ఖండించాల్సిన సీఎం.. న్యూట్రల్ అన్నట్లుగా చెప్పడంతోనే అనుమానాలొస్తాయి. అదే సమయంలో.. జగన్ .. పవన్ కల్యాణ్ పోటీ చేస్తోంది.. చంద్రబాబు ప్రొత్సాహంతోనే అనే విమర్శలు రావడంతో.. చంద్రబాబు “తప్పేమిటి.. జగన్‌కు నొప్పేమిటి..” అన్నట్లుగా స్పందించారు. దీంతో మరింతగా మంట రాజేసినట్లయింది. దీన్ని అంది పుచ్చుకుని మీడియా… ఇక దాదాపుగా.. పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీతోనే అన్నట్లుగా ప్రచారం ప్రారంభించింది. విశ్లేషణలు చేస్తోంది. ఓ రకంగా ఇది.. పవన్ కల్యాణ్ కు టీడీపీ వైపు నుంచి వచ్చిన అతి పెద్ద సవాల్. ఇప్పుడు పవన్ కల్యాణ్.. తాను టీడీపీతో కలిసే ప్రశ్నే లేదని… మాటలతో నిరూపించుకోలేరు. దానికి తన రాజకీయ వ్యూహచతురత అంతా ఉపయోగించి కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే.. మళ్లీ టీడీపీ ముద్ర పడితే.. మొత్తానికే తేడా వస్తుంది.
జగన్ ఇప్పుడే ఎందుకు పవన్‌ను టార్గెట్ చేస్తున్నారు..?
జగన్మోహన్ రెడ్డి.. కొంత కాలం కిందటి నుంచి పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు. జనసేన నాలుగో ఆవిర్భావ దినోత్సవ సమయంలో.. చంద్రబాబు, లోకేష్‌పై తీవ్ర విమర్శలు చేయక ముందు.. పవన్ కల్యాణ్‌ను జగన్ ఇష్టం వచ్చినట్లు విమర్శించారు. అసలు సినిమా తక్కువ ఇంటర్వెల్ ఎక్కువ అన్నట్లుగా మాట్లాడేవారు. నాలుగో ఆవిర్భావ దినోత్సవం తర్వాత విమర్శించడం లేదు. పవన్ కల్యాణ్ చంద్రబాబును తిట్టినంత కాలం… వైసీపీ కూడా… పవన్ పై సాఫ్ట్ కార్నర్ చూపించింది. నిజం చెప్పాలంటే.. ఆ సమయంలో.. పవన్ కల్యాణ్ కూడా జగన్ పై సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించారు. చంద్రబాబునే ఎక్కువగా టార్గెట్ చేసుకున్నారు. అందుకే ఒకప్పుడు.. అసభ్యంగా సైగలు చేస్తూ.. రబ్బర్ సింగ్ అని పవన్ ను విమర్శించిన రోజా లాంటి వాళ్లు కూడా.. పవన్ కు మంచోడని సర్టిఫికెట్ ఇచ్చేశారు. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితి మారింది. మళ్లీ జగన్.. పవన్ పై వ్యక్తిగత విమర్శలతో దాడి చేస్తున్నారు. అదే సమయంలో… రెండు పార్టీల మధ్య పొత్తుల చర్చలు ఫెయిలయ్యాయని…సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కారణం ఏదైనా… ఇప్పుడు.. జగన్‌తో.. పవన్ కలిసే చాన్స్ లేదు. అందుకే చంద్రబాబుకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్. ఇప్పుడు.. పవన్‌కు జగన్ వైపు నుంచి వస్తున్న వ్యూహాత్మక ప్రచారాన్ని తిప్పికొట్టగలగాలి. ఈ విషయంలో తాను టీడీపీకి దగ్గర కాబోనని వివరణ ఇస్తే… మరింత ఇరుక్కుపోయినట్లవుతుంది. వైసీపీ.. అలాంటి ప్రచారం మళ్లీ చేయకుండా.. పవన్ కల్యాణ్ తన రాజకీయ చతురత అంతా ప్రదర్శించాల్సి ఉంటుంది.
ఎవరికీ దగ్గర కాదని పవన్ నిరూపించుకోలేకపోతే ఏం జరుగుతుంది..?
ఇప్పుడు పవన్ కల్యాణ్.. క్రాస్ రోడ్స్ లో ఉన్నారు. ఆయన రాజకీయ పరిణితి లేని తనాన్ని ఆసరాగా చేసుకుని.. అటు చంద్రబాబు, ఇటు జగన్ కూడా… రాజకీయ తెరపై జనసేనను.. నామమాత్రం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే.. ఇప్పుడీ.. ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్.. దీన్ని అత్యంత సమర్థంగా తిప్పికొట్టగలగాలి. ఏ పార్టీతోనూ.. అంట కాగే ప్రశ్నే లేదని.. స్వతంత్రంగా ఎదిగుతామని కాన్ఫిడెన్స్ ను.. అభిమానుల్లోకి పంపించగలగాలి. ఈ క్రమంలో.. పొత్తులు పెట్టుకుంటే.. తమ సీటు గ్యారంటీ అని భావించే కొంత మంది నేతలు… ఆయనపై ఒత్తిడి తెస్తారు. కానీ… పార్టీలో నేతలు ఒత్తిడి తేవడం వల్లనే ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయిందనే విషయాన్ని పవన్ గుర్తు పెట్టుకుని రాజకీయం చేయాలి. జనసేన స్ట్రాంగ్‌గా నిలబడాలంటే..కచ్చితంగా… తాను ఏ పార్టీకి అనుబంధం కాదని… అభిమానుల్లో నమ్మకం కలిగించాలి. కానీ.. తమకు అనుబంధమని టీడీపీ.. అదే నిజమని… వైసీపీ ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రెండింటి లక్ష్యం… జనసేనను బలహీన పరచడమే. మరి పవన్ కు ఈ సవాల్‌ను అధిగమించేంత సామర్థ్యం ఉందా..?
—–సుభాష్