వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి రెండో తేదీ నుంచి ఆయన బస్సుయాత్రకు ప్లాన్ చేసుకున్నారు. పాదయాత్రలో కవర్ కాని నియోజకవర్గాలను ఆయన బస్సుయాత్రలో కవర్ చేస్తారు. పాదయాత్ర ముగించిన తర్వాత నేరుగా తిరుమల శ్రీనివాసుడ్ని దర్శించకుంటారు. ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో లండన్ వెళ్లబోతున్నారు. అక్కడ చదువుకుంటున్న కుమార్తెతో పది రోజులు గడిపి తిరిగి వస్తారు. ఆ తర్వాత బస్సుయాత్ర ప్లాన్ చేసుకుున్నారు. ఈ లోపే.. కృష్ణానది పక్కన తాడేపల్లిలో నిర్మించుకుంటున్న ఇంట్లో గృహప్రవేశ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. అందులో లాంఛనంగా గృహప్రవేశం చేస్తారు కానీ అందులో ఉండరు. ఎన్నికల తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో ఆ ఇంట్లో మకాం పెట్టే అవకాశం ఉంది.
ఇంత కాలం పాదయాత్ర చేసినా… అది ప్రజలకు గుర్తుండదని.. ఎన్నికలకు ముందు చేసిన పోరాటాలే.. ఎక్కువగా ఓటర్లను ప్రభావితం చేస్తాయని… జగన్ అనుకుంటున్నారు. నిజానికి బస్సుయాత్ర ప్రారంభమయ్యే సమయానికి… ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే సరికి… సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది.అంటే.. ఓ రకంగా చెప్పాలంటే.. ఏపీలో ఫిబ్రవరి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఇలాంటి సమయమే కీలకమైనదని.. వైసీపీ భావిస్తోంది.
జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికను ఇప్పటికే దాదాపుగా పూర్తి చేశారని… పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చిన నివేదిక ఆధారంగానే.. ఇప్పటికే.. దాదాపుగా 120 నియోజకవర్గాల్లో అభ్యర్థులకు… స్పష్టమైన సమాచారం ఇచ్చారని..వారు నియోజకవర్గాల్లో పని చేసుకుంటున్నారని చెబుతున్నారు. కొత్తగా ఇన్చార్జ్ పదవులు పొందిన వాళ్లంతా… అభ్యర్థిత్వం పొందుతారని.. అందులో ఎలాంటి సందేహంలేదని.. పక్కన పెట్టిన సీనియర్లు, సన్నిహితులకు.. అవకాశం లేదని చెబుతున్నారు. ఇక అభ్యర్థులను ప్రకటించడమే తరువాయంటున్నారు.