వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అంశం.. ఒక్క సారిగా మళ్లీ ప్రజల్లోకి చర్చకు రావడం… సీఎంగా ఉండి కూడా చెల్లి సునీతకు న్యాయం చేయడంలో విఫలమయ్యారంటూ.. అన్ని వేళ్లూ సీఎం జగన్ వైపు చూపిస్తూండటంతో… వైఎస్ విజయలక్ష్మి రంగంలోకి దిగారు. ఆమె పేరుతో ఐదు పేజీల లేఖను వైసీపీ వర్గాలు మీడియాకు విడుదల చేశాయి. ఇందులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వైఎస్ వివేకాను హత్య చేయించారని… వైఎస్ విజయలక్ష్మి అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ లేఖలో అంతకు మించి… జగన్ పై వస్తున్న సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు ఎక్కువ పేజీలు కేటాయించారు.
వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ న్యాయం చేయడం లేదని చెప్పడం కరెక్ట్ కాదని.. సీబీఐ దగ్గర కేసు ఉందని ఆమె చెప్పుకొచ్చారు. వైఎస్ వివేకాను హత్య చేసిన వారికి శిక్ష పడాల్సిందేనన్న సునీత మాటే.. మా కుటుంబం మొత్తం మాటని చెప్పుకొచ్చారు. వైఎస్ సునీత ఢిల్లీలో మాట్లాడిన మాటలను బట్టి… వైఎస్ కుటుంబంలోని వ్యక్తులే.. నేరానికి పాల్పడి ఉంటారని విస్తృతంగా చర్చ జరుగుతున్న సమయంలో… వైఎస్ విజయలక్ష్మి పేరుతో ఐదు పేజీల లేఖ విడుదల చేయించడం ఆసక్తికరంగా మారింది. లేఖలో షర్మిల ప్రస్తావన కూడా ఉంది. జగన్ కు షర్మిలకు మధ్య విబేధాలు తీసుకు రావాలన్న ప్రయత్నాలు ఫలించవని… ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. షర్మిల, జగన్ మధ్య ఉన్నవి అభిప్రాయభేదాలు కాదని.. వేర్వేరు అభిప్రాయాలన్న లాజిక్ వినిపించారు.
కుటుంబంలో చిచ్చు ఏర్పడిందని… రెండు వర్గాలుగా విడిపోయిందని… ప్రస్తుతం ఏపీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. జగన్ న్యాయం చేయడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే కేసు సీబీఐ వద్ద ఉందని .. తమకేం సంబంధం లేదని చెప్పడానికే ఇప్పుడ ువైసీపీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. వైసీపీ నేతలందరూ అదే చెప్పారు. విజయలక్ష్మి కూడా అదే చెబుతున్నారు. జగన్, షర్మిల మధ్య వచ్చిన తేడాల్లో… ఆమె మానసికంగా నలిగిపోతున్నారని.. షర్మిల వైపే ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.