జగన్ కు సలహాలు, సూచనలు ఎవరు చేస్తున్నారో కానీ , ఆయన రాజకీయం మాత్రం తీవ్ర విమర్శల పాలౌతుంది. బెజవాడ ముంపునకు గురి అయి లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పరామర్శకు వెళ్ళాల్సిన నేత.. పార్టీ నేత కోసం ములాఖత్ కు వెళ్లడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.
ఇటీవల వర్షాలకు బెజవాడ జలదిగ్బంధంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఒకటి, రెండుసార్లు బాధితులను పరామర్శించేందుకు వెళ్ళిన జగన్ అక్కడ కాసేపు ఉండి వెంటనే వెనుదిరగడం పట్ల విమర్శలు వచ్చాయి. అయినా పరిస్థితులు కుదుటపడ్డాక జగన్ మరోసారి వస్తారని స్థానిక వైసీపీ నేతలు భావిస్తే.. ఆయన మాత్రం మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శించేందుకు గుంటూరు జైలుకు వెళ్తున్నారు. అక్కడ ములాఖత్ ద్వారా నందిగం సురేష్ తో మాట్లాడుతారు.
ఓ వైపు రాష్ట్రమంతా బెజవాడలో తలెత్తిన పరిస్థితులను చూసి ఆవేదన చెందుతుంటే.. జగన్ అవేవి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ ఆపత్కాల సమయంలో రాజకీయాలను పక్కనపెట్టి మానవీయంగా వ్యవహరించాల్సిన విపక్ష నేత.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయిన నందిగం సురేష్ ను పరామర్శించేందుకు వెళ్ళడం తప్పుడు సంకేతాలను తీసుకెళ్తుందని అంటున్నారు.
జగన్ కు రాజకీయాలే పరమావధి అని మరోసారి తేలిపోయిందని..ఆయన ఇక మారరు అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.