జగన్ పాదయాత్ర ఎనిమిదో రోజుకు చేరుకుంటోంది. గడచిన వారం రోజులూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం, ఆయన పాలనలో ఏ ఒక్కరినీ న్యాయం జరగలేదని ఆరోపించడం, మన ప్రభుత్వం వస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పడం… ఇవే అంశాలకు పరిమితమై జగన్ మాట్లాడుతూ వస్తున్నారు. ఎన్నికల ముందు ప్రసంగాలు మాదిరిగానే హామీలు ఇస్తున్నారు. అయితే, ఈ క్రమంలో ఒక విషయంపై ప్రజలకు మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ‘జగన్ ఏపీకి ముఖ్యమంత్రి కావాలి.. బాగానే ఉంది! కానీ, జగనే ఎందుకు ముఖ్యమంత్రి కావాలి..?’ ఈ ప్రశ్నను ప్రజలు నేరుగా వేయకపోయినా… తాను ఏ విధంగా చంద్రబాబుకు ప్రత్యామ్నాయం కాబోతున్నానో అనేది ప్రజలకు స్పష్టత ఇవ్వాలి కదా! చంద్రబాబు పాలన బాలేదు, కాబట్టే మా పాలన వస్తుందని చెప్పడంలో తనదైన ముద్ర ఎక్కడుంది..? పోనీ, రాజన్న రాజ్యం మళ్లీ తెస్తామని ప్రతీచోటా చెబుతున్నారు! రాజన్న రాజ్యమంటే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాలన. అది కాంగ్రెస్ హయాంలో సాగిన పాలన. ఒకవేళ ఆ పాలన మళ్లీ తాను తీసుకొస్తానని చెప్పినా… అందులోనూ తనదైన జగన్ ముద్ర ఎక్కడున్నట్టు..?
ఏడో రోజు పాదయాత్రలో భాగంగా కడప జిల్లాలో బీసీలతో జగన్ మాట్లాడారు. ఏడాది తరువాత మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఇవాళ్ల చంద్రబాబు నాయుడు చేస్తున్న పరిపాలనకు ‘భిన్నం’గా ప్రతీ బీసీ సోదరుడి ముఖంలో చిరునవ్వులు చూడాలని ఆరాటంతో ఈ కార్యక్రమం చేస్తున్నా అని జగన్ అన్నారు. ఈ సందర్భంగా నాన్నగారి పరిపాలనను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని అడుగుతా ఉన్నా అని కోరారు! సో.. ఇక్కడ ఆ ‘భిన్నత్వం’ ఏంటనే స్పష్టత ఇవ్వలేకపోయారు. ప్రతీ చోటా ఇదే జరుగుతోంది. చిరునవ్వులు చూడాలని అనుకుంటున్నా అంటే సరిపోదు కదా! అవే ఎలా అనేదే అసలు ప్రశ్న..? చంద్రబాబుకు భిన్నంగా పరిపాలన ఉంటుందని అంటున్నారే తప్ప.. ఆ భిన్నత్వం ఏంటనేది స్పష్టంగా విడమరచి ప్రెజెంట్ చేయడం లేదు. ఇదే సందర్భంలో వైయస్సార్ పాలనను గుర్తు చేసుకోవాలని ప్రతీచోటా కోరుతున్నారు. చంద్రబాబు భిన్నమైన పాలన అంటే, వైయస్సార్ పాలన అన్నమాట! అప్పుడది కాంగ్రెస్ పాలన అవుతుంది. ఇంతకీ వైకాపా పాలన అంటే ఏంటీ ఎలా ఉంటుంది..? జగన్ సొంత మార్క్, తనదైన శైలి ఎక్కడుంది..?
ఈ నాలుగేళ్లూ ప్రతిపక్ష నేతగా జగన్ సాధించింది ఏంటనేది పాదయాత్రలో ఎక్కడా ఇప్పటివరకూ చెప్పలేదు. ‘ఇదిగో ఈ అంశాలపై ప్రజల తరఫున రాజీలేని పోరాటం చేశామ’ని మాట్లాడటం లేదు. ప్రతిపక్ష నేతగా ప్రజల తరఫున ఫలానా సమస్యలపై బలంగా తమ వాణిని వినిపించామని చెప్పడం లేదు. తాను పోషించిన ప్రతిపక్ష నాయకుడి పాత్రను సమర్థంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటే.. వ్యక్తిగతంగా జగన్ సొంత శైలి ఏంటో ప్రజలకు ఇంకాస్త స్పష్టంగా అర్థమౌతుంది. అంతేగానీ, రాజన్న రాజ్యం తెస్తా, చంద్రబాబుకు భిన్నంగా పాలిస్తా అంటూ జనరలైజ్డ్ వ్యాఖ్యానాలు చేస్తుంటే… ఆ భిన్నత్వం ఏంటనేది చాలామంది అర్థం కావడం లేదు!
ముఖ్యమంత్రి పదవికి తాను అర్హుడనని చెప్పుకోవడంతోపాటు, ఎందుకు ప్రయత్నామ్నాయంగా తనను చూడాలనే అంశంపై ప్రజలకు జగన్ మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైయస్ వారసత్వమో, చంద్రబాబుపై వ్యతిరేకత వల్లనే జగన్ ముఖ్యమంత్రి అవుతారంటే సరిపోదు కదా! నిజానికి ఆ రెండూ వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుపునకు సరైన ప్రాతిపదికలు కాలేవు. ఎందుకంటే, వైయస్సార్ పాలన అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అంశం. ఆ రోజులు వేరు, ఆ పాలన వేరు. తరువాత, రాష్ట్రం విడిపోయింది. ప్రాథమ్యాలు మారిపోయాయి. వైయస్ పట్ల అభిమానం ప్రజల గుండెల్లో ఉండొచ్చేమోగానీ, అదొక్కటే వైకాపాకి ఓటేయించేంతగా ప్రభావితం చేస్తుందా..? ఆ లెక్కన ఎన్టీఆర్ మరణం తరువాత వరుసగా టీడీపీనే అధికారంలో ఉండాలి. అలా జరగలేదు కదా!
విభజన తరువాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అది చంద్రబాబుకే సాధ్యమని 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. మళ్లీ 2019లోనూ అదే మాట చెబుతారు! ఇప్పుడిప్పుడే అభివృద్ధి మొదలౌతోందీ, పునాదు వేశామూ, కేంద్రం నుంచి సాయం అందలేదు కాబట్టి కాస్త ఆలస్యం అవుతోందీ.. అన్నీ పూర్తవ్వాలంటే మరోసారి అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయకత్వమే రాష్ట్రానికి అవసరం అనే అభిప్రాయాన్ని ప్రచారంలోకి తెస్తారు. ఆ సమయంలో ప్రత్యామ్నాయ అభివృద్ధి కాముకుడిగా జగన్ తనను తాను ఎలా ఎస్టాబ్లిష్ చేసుకుంటారు..? ఆ ప్రయత్నమేదో ఇక్కడి నుంచే మొదలు కావాలి. చంద్రబాబుపై వ్యతిరేకత, వైయస్ లెగసీ.. ఈ రెండూ పక్కపెట్టి సొంతంగా జగన్ ఏంటనేది ప్రజలకు మరింత స్పష్టంగా చెప్పుకునే ప్రయత్నం చేయాలి.