ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ప్రక్షాళనకు ముహుర్తం ఖరారయింది. కొత్త మంత్రుల్ని తీసుకోబోతున్నారు. ఈ మేరకు గవర్నర్కు సమాచారం ఇచ్చారు. 11వ తేదీన రాజ్భవన్లో మంత్రుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు.అయితే సీఎం జగన్ కొత్త మంత్రుల్ని ఏ ప్రతిపాదనక ఎంచుకుంటున్నారు ? ఎవరినైనా కొనసాగిస్తే ఏ ప్రాతిపదికన కొనసాగిస్తారు ? వంటి అంశాలను పరిశీలిస్తే.. కేవలం రెండు ప్రామాణికాలే కనిపిస్తున్నాయి. అందులో ఒకటి కులం.. రెండోది మతం. ముఖ్యంగా కులం చూసి.. తర్వాత మతం చూసి మంత్రి పదవుల్ని సీఎం జగన్ పంచబోతున్నారు.
ఎన్నికలకు వెళ్లే తన మంత్రివర్గాన్ని సీఎం జగన్ కులాల సమాహారంగా ఉండాలని డిసైడయ్యారు. ఏకులానికి మంత్రి పదవి ఇస్తే.. ఆ కులం ఎలా ప్లస్ అవుతుందన్న లెక్కలు వేసుకుంటున్నారు. మంత్రి పదవుల్ని తొలగించే విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కుల సమీకరణాలతో లెక్కలు వేసి వేసి చివరికి అసలు మంత్రి గా పని చేయడం మర్చిపోయిన ఎన్నో వివాదాల్లో ఉన్న గుమ్మనూరు జయరాం వంటి వారిని కొనసాగించబోతున్నారని.. తన నియోజకవర్గంలో జడ్పీటీసీ స్థానాన్ని గెలిపించుకోలేకపోయిన జోగి రమేష్ వంటి వారికి చాన్సిస్తున్నారని వైసీపీలో ప్రచారం జరుగుతోంది.
సీఎం జగన్మోహన్ రెడ్డి కాకుండా మంత్రివర్గంలో ఇరవై ఐదు మంది ఉంటారు. వీరిలో బీసీ, ఎస్సీ , ఎస్టీ అందులోనూ బలమైన సామాజికవర్గాలకు అవకాశం కల్పిస్తున్నారు. అలాగే తాము ఆ కులాలకు రాజ్యాధికారం ఇచ్చామని చెప్పుకోబోతున్నారు. వైసీపీలో ఏ పదవులు రావాలన్నా ఓ సమీకరణం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు అయినా బ్యాక్ గ్రౌండ్లో మతం కూడా చూస్తారు. హోంమంత్రిగా సుచరితకు చాన్స్ రావడానికి అదే కారణం అంటారు. అలాంటి కోణాలను ప్లస్ పాయింట్లుగా చూసి మంత్రులుగా ఎంపిక చేయబోతున్నారు. మిగతా విషయాల్లో సీఎం అర్హతల గురించి చాలా చెబుతారు కానీ.. తన మంత్రివర్గం విషయంలో.. కులం చూస్తాం.. మతం చూస్తాం అని చేతలతోనే చూపిస్తున్నారు.