మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని శిక్షించడానికి ఎలా అయితే దిశ చట్టాన్ని తీసుకు వచ్చారో.. అచ్చంగా అలాగే.. అవినీతి చేస్తూ దొరికిపోయిన వారిని ఇన్‌స్టంట్‌గా శిక్షించేందుకు…ఓ చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అవినీతి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై జగన్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా… దొరికిన వారిపై చర్యలు వేగంగా తీసుకోలేకపోతున్న అంశాన్ని గమనించారు. వెంటనే… ఈ దిశగా చర్యలు తీసుకోవాలని.. భావించారు. లంచం తీసుకుంటూ దొరికితే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకోవాలని..ఇందు కోసం .. ‘దిశ’ తరహాలో అసెంబ్లీలో బిల్లు పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు.
ఏపీలో ఇప్పటికే అవినీతి నిరోధానికి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకున్నారు. 1902 కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ నెంబర్‌కు వచ్చే అవినీతి సంబంధిత అంశాలు.. ఏసీబీకి చెందిన 14400కు బదలాయించాలని ఆదేశించారు. అలాగే.. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులు అనుసంధానం చేయనున్నాు. ఎమ్మార్వో, ఎండీఓ, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్,.. టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అవినీతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఏసీబీ అధికారులను జగన్ ఆదేశించారు. అంతకు ముందు.. గుడ్ గవర్నెన్స్‌పై సీఎం జగన్‌కు అహ్మదాబాద్ ఐఐఎం నివేదికను ప్రొ. సుందరవల్లి నారాయణ స్వామి అందచేశారు. సీఎం జగన్ అధికారం చేపట్టిన తర్వాత ఈ కమిటీని నియమించారు.
మహిళలపై అఘాయిత్యాల నిరోధానికంటూ..అసెంబ్లీలో దిశచట్టాన్ని పాస్ చేసినప్పటికీ.. ఇప్పటి వరకూ ఆ చట్టం అమల్లోకి రాలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం బయటకు చెప్పడం లేదు. కానీ ఈ చట్టం పేరుతో ప్రచారం మాత్రం అధికంగా చేసుకుంటున్నారు. సీఎం జగన్ కూడా.. అప్పుడప్పుడు దిశా చట్టం అమలుపై సమీక్ష చేస్తూంటారు. ఇప్పుడు ఆ తరహాలో అవినీతి నిరోధక బిల్లు కూడా సిద్ధం చేస్తున్నామని చెబుతున్నారు. కానీ.. అసలు అమల్లోకి రాని చట్టాన్ని ఎందుకు నమూనాగా చూపిస్తున్నారో మాత్రం .. ఎవరికీ అర్థం కాని అంశం.