అన్న వస్తున్నాడు అంటూ ఇప్పటికే ఓ నినాదంతో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఓ రౌండ్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ‘అన్న పిలుపు’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు సమాచారం. దీని మోడల్ ఏంటంటే… ప్రజలకు నేరుగా జగన్ ఉత్తరాలు రాస్తారన్నమాట! ప్రజలు అంటే అందరికీ కాదండీ.. తటస్థులకు మాత్రమే. వారెవరంటే… ఇంతవరకూ ఏ పార్టీకి చెందకుండా ఉండేవారిని గుర్తించి, జగన్ లేఖలు రాబోతున్నారు. వారిని గుర్తించే ప్రక్రియను ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇప్పటికే పూర్తి చేసిందని సమాచారం. గ్రామాల్లో ఉంటూ, కాస్త ప్రభావంతంగా ఉండే వ్యక్తులను గుర్తించారని తెలుస్తోంది. వారిపేర్లూ వివరాలూ చిరునామాలూ అన్నీ సేకరించాట.
ఇంతకీ, ఈ లేఖల ద్వారా జగన్ చెప్పబోతున్నది ఏంటంటే… ‘పాదయాత్ర సందర్భంగా మీ ప్రాంతానికి వచ్చినప్పుడు, మీ గురించి తెలుసుకున్నాను. రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. మీ స్థానిక సమస్యలతోపాటు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలీ, దీనిపై మీ సలహాలూ సూచనలు ఇవ్వండి’ అంటూ జగన్ కోరబోతున్నట్టు తెలుస్తోంది. దీని కోసం ఒక ఫోన్ నంబర్, మెయిల్ ఐడీలను కూడా అందుబాటులోకి తెస్తారట. ముందుగా ఉత్తరాల పంపి, వాటికి వచ్చిన స్పందనను చూసుకుని… లేఖలు రాసినవారిని జగన్ నేరుగా కలుస్తారని తెలుస్తోంది. ఇంతకీ ఉన్నట్టుండి తటస్థులపై ఎందుకింత ఫోకస్ పెడుతున్నారంటే…. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేది వీరే అనేది వైకాపా నమ్మకం. తటస్థులను తమవైపు ఆకర్షించుకోవడం ద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచుకోవన్నది వారి ఆలోచన.
అయితే, ఈ కార్యక్రమం ద్వారా వైకాపా ఒక విషయాన్ని ఒప్పుకున్నట్టే లెక్క. దాదాపు ఏడాదిన్నరపాటు జగన్ చేసిన పాదయాత్ర ప్రభావం తటస్థులపై లేదా..? వారిని ఆలోచింపజేసే విధంగా జగన్ మాట్లాడలేకపోయారా..? రాష్ట్ర అభివ్రుద్ధి కోసం, స్థానిక సమస్యల పరిష్కారం కోసం పుంఖానుపుంఖాలుగా వాగ్దానాలు పాదయాత్రలో జగన్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అవే సమస్యలపై పరిష్కారాలు చెప్పండీ అంటూ లేఖలు రాయడంలో అర్థమేంటి..? ఇంకో ముఖ్యమైన అంశం… పాదయాత్ర బయలుదేరడానికి ముందు జగన్ చెప్పిన మాట ఒక్కసారి గుర్తుచేసుకుంటే, ప్రజల సమస్యలపై అవగాహన పెంచుకుని.. యాత్ర అనంతరం ప్రజా మేనిఫెస్టో తయారు చేస్తా అన్నారు. అంటే, ప్రజల నుంచి వచ్చిన స్పందనను యాత్రా సమయంలో సరిగా అర్థం చేసుకోలేకపోయారా..? ఇప్పుడీ ఉత్తరాల ద్వారా కేవలం కొంతమందికి టచ్ లోకి వెళ్లాలనేదే తప్ప.. ఆ ఫీడ్ బ్యాక్ తో కొత్తగా పథకాలు రూపొందించి ప్రకటించే కసరత్తుకి సమయం ఎక్కడుంది..?