“ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమే”, ” ప్రత్యేక హోదా సాధించే శక్తి జగన్ కి మాత్రమే ఉంది”, ఓ ఏడాదిన్నర క్రితం వరకు సాక్షి ఛానల్ లో పదేపదే వినిపించిన మాటలు ఇవి. అయితే జగన్ తాను అనుకున్నట్లుగానే ముఖ్యమంత్రి పదవి సాధించారు. దాదాపు ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. అయితే ఈ ఏడాది కాలంలో ప్రత్యేక హోదా గురించి ఏ మాత్రం పోరాడారు అన్న చర్చ ప్రస్తుతం నడుస్తోంది. వివరాల్లోకి వెళితే..
పార్లమెంటులో మన్మోహన్ సింగ్ హామీ:
2014లో ఆంధ్రప్రదేశ్ ని విభజించే సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రకటన చేశారు. అయితే దీని ని చట్టంలోని పొందుపరచ కుండా కేవలం మాట పూర్వక హామీ మాత్రమే ఇచ్చారు. జైరాం రమేష్ లాంటి నేతలు, ఇది ప్రభుత్వం తరఫున ఇస్తున్న హామీ కాబట్టి అధికారం లో ఏ ప్రభుత్వం ఉన్నా ఈ హామీని నెరవేరుస్తుందంటూ ఆంధ్ర ప్రజలను మభ్యపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయి బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్ళ పాటు ప్రత్యేక హోదా గురించి ఎవరూ మాట్లాడలేదు. ఎన్డియే ప్రభుత్వంలో ఉన్న కారణంగా చంద్రబాబు బిజెపిని నిలదీసే ధైర్యం చేయలేక పోతే, తన మీద ఉన్న అక్రమ ఆస్తుల కారణంగా అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మిన్నకుండిపోయారు.
ప్రత్యేక హోదా టాపిక్ ని అప్పట్లో బలంగా వినిపించిన పవన్, అనుసరించిన జగన్:
ప్రత్యేక హోదా అన్న టాపిక్ ప్రజలు పూర్తిగా మరిచి పోయే సమయంలో, పవన్ కళ్యాణ్ రెండు మీటింగులు పెట్టి బిజెపి ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసి ప్రత్యేక హోదా గురించి నిలదీసి మళ్లీ ప్రత్యేక హోదా అన్న టాపిక్ మీద చర్చ జరిగేలా చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ కు కూడా ప్రజల్లో కాస్త క్రేజ్ వచ్చింది. ధైర్యంగా కేంద్రాన్ని నిలదీశాడు అంటూ అభినందనలు వచ్చాయి. దాంతో ప్రత్యేక హోదా గురించి ఏమాత్రం మాట్లాడకుండా మిన్నకుండి పోతే మొదటికే మోసం వస్తుందన్న ఉద్దేశంతో జగన్ కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. అయితే అక్కడ కూడా చంద్రబాబు అసమర్థత వల్లే ప్రత్యేక హోదా రావడం లేదంటూ విమర్శలు చేశారు తప్పించి మోడీని నేరుగా నిలదీసే సాహసం చేయలేదు. కానీ ప్రత్యేక హోదా పేరిట ఏదో ఒక కార్యక్రమం అంటూ చేశాడు కాబట్టి సాక్షి ఛానల్, వైఎస్ఆర్సిపి అభిమానులు జగన్ మాత్రం ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తున్నాడు అంటూ పదే పదే పదే పదే చెప్పసాగారు. మొదటి నాలుగేళ్లు మిన్నకుండి పోయిన చంద్రబాబు ఆఖరు ఏడాది యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం ఆయనకు ప్లస్ కాకపోగా మరింత మైనస్ అయింది. మొదట్లో ప్రత్యేక హోదా గురించి బలంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ కూడా తీరా ఎన్నికల సమయానికి వచ్చేసరికి ప్రత్యేక హోదా పై ఎటువంటి కార్యాచరణ చేయకుండానే ఎన్నికలకు వెళ్లి పోయారు. మొత్తానికి రకరకాల కారణాల వల్ల జగన్ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు.
కేంద్రం మెడలు వంచుతాం అన్న మాటలు ఏమయ్యాయి?
కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాం అంటూ వైఎస్ఆర్సిపి నాయకులు గతంలో బీరాలు పలికిన సంగతులను ఇప్పుడు నెటిజన్లు జగన్ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా గుర్తు చేస్తున్నారు. పార్లమెంటులో ప్రకటన చేసి ఆరు సంవత్సరాలు దాటి పోయినప్పటికీ ప్రత్యేక హోదాపై గట్టిగా నిలదీసి పోరాడే నాయకులు ఆంధ్ర నాట లేకపోవడం దురదృష్టకరం అంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. అయితే గతంలో ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు అసమర్థత మాత్రమే అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్న నెటిజన్లు – అదే లాజిక్ ప్రకారం చూస్తే ఇప్పుడు ప్రత్యేక హోదా రాకపోవడానికి జగన్ అసమర్థత కారణమా అంటూ సెటైర్స్ వేస్తున్నారు.
ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం నుండి వచ్చే నిధుల లో 90 శాతం వరకు గ్రాంట్ల రూపంలోనూ కేవలం 10 శాతం మాత్రమే తిరిగి కట్టవలసిన రుణం రూపంలో ఉంటుంది. సాధారణ రాష్ట్రాలకు ఇది 60:40 నిష్పత్తిలో ఉంటుంది. విభజన కారణంగా హైదరాబాద్ ఆదాయాన్ని కోల్పోవడమే కాకుండా, జనాభా నిష్పత్తిలో అప్పులను పంచుకుని తీవ్ర రెవెన్యూ లోటు తో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిజంగా జీవనాడి వంటిది. ఈ విషయాన్ని పలుమార్లు సాక్షి పత్రికలో సంపాదకీయాల లో కూడా రాశారు. అయితే 151 ఎమ్మెల్యేల బలం కలిగి, 20 కి పైగా ఎంపీ స్థానాలు గెలిచి బలమైన రాజకీయ పక్షంగా ఉన్న వై ఎస్ ఆర్ సి పి నేతలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా మిన్నకుండి పోవడం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కు శాపం గా పరిణమిస్తుంది అనడంలో సందేహం లేదు.