అసలు ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఒక్క చోటే ఉండటం వల్ల… రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగడం లేదన్న తన అభిప్రాయాన్ని నిపుణుల కమిటీల ద్వారా చెప్పించి.. పాలనను వికేంద్రీకరణ చేయడానికి సిద్ధపడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ సమయంలో.. నరేంద్రమోడీ.. కూడా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే కేంద్రీకరణ. ఢిల్లీలో వివిధ చోట్ల ఉన్న పాలనా కార్యాలయాలన్నీ.. ఒక్క చోటకు తెచ్చేలా.. ఓ కొత్త కార్యాలయ భవన సముదాయాల్ని నిర్మించాలని నిర్ణయించారు. సెంట్రల్ విస్టా పేరుతో ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి.
ప్రతీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ఓ సెక్రటేరియట్ ఉంది. 35వేల మంది ఉద్యోగుల వరకూ ఉంటారు. వీరందరికీ.. ఢిల్లీలో వివిధ చోట్ల.. కార్యాలయాలు ఉన్నాయి. అన్నీ కలిపి ఒకే చోట లేవు. దీంతో.. పాలనా పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రహించిన కేంద్రం…కొత్త నిర్మాణాలకు ప్రణాళికలు వేసింది. ఇందులో నూతన పార్లమెంటు భవనం, 70 వేల మంది ఒకే చోట పనిచేసే సౌకర్యాలను నిర్మిస్తారు. కొత్త పార్లమెంటు భవనాన్ని దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనే 2022 ఆగస్టు 15నాటికల్లా అందుబాటులోకి తెస్తారు.
నరేంద్రమోడీ .. అభివృద్ధి పేరుతో.. ఒక్కో విభాగాన్ని ఒక్కో రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనే ఆలోచన చేయలేదు. పైగా.. ఢిల్లీలోనే .. వేర్వేరు చోట్ల ఉండటం వల్ల ఇబ్బందని గుర్తించారు. అందుకే కార్యాలయాలన్నీ కేంద్రీకృతం చేస్తున్నారు. పాలనా వ్యవస్థలు.. ఒక్కోటి .. ఒక్కో చోట ఉండటం వల్ల వచ్చే సమస్యలేమిటో.. సామాన్యులూ అంచనా వేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రం.. అందులో అభివృద్ధి కనిపిస్తోంది. ఆయనను సమర్థించే వారికి.. అద్భుతమైన అభిృద్ధి నమూనా కనిపిస్తోంది. కానీ.. ప్రధానమంత్రి వంటి వారు వేస్తున్న అడుగులు.. వారికి చిత్రంగా అనిపించవచ్చు.