నివార్ తుపాన్ కారణంగా పెద్ద ఎత్తున నష్టపోయిన రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి భారీ నష్టపరిహారం ప్రకటిస్తారని ఆశ పడిన వారికి నిరాశే ఎదురయింది. ఎకరానికి పంటను బట్టి పదిహేను నుంచి పాతిక వేల వరకూ సాయం ప్రకటిస్తారన్న చర్చ జరిగింది. వరదల్లో మునిగిపోయిన వారికి కూడా ఇంటికి పదివేల వరకూ సాయం ఇస్తారని కూడా వైసీపీ వర్గాలు చెప్పుకున్నారు. ఈ మేరకు ఏరియల్ రివ్యూ చేసినప్పుడే ప్రకటన చేస్తారని అనుకున్నా.. చేయలేదు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి.. అక్కడే ప్రకటన చేస్తారని అనుకున్నారు. దానికి తగ్గట్లే.. అసెంబ్లీలో తన ప్రకటన కోసం రైతులు ఎదురు చూస్తున్నారని.. ఓ సందర్భంలో జగన్ వ్యాఖ్యానించారు.
దీంతో జగన్ వరద సాయం ప్రకటనపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ ప్రకటన అసాంతం పూర్తయిన తర్వాత ఎలాంటి సాయమూ లేదని తేలాక.. ఉసూరుమన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. నియోజకవర్గాల్లో రైతులనుంచి సాయం కోసం పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోంది. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ప్రసాదరెడ్డి తాను రూ. కోటి రూపాయలు విరాళం ఇస్తానని ప్రకటించారు. మిగిలిన వారు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇంకా భారీగా స్పందిస్తుందని అనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శైలి మాత్రం భిన్నంగా ఉంది. పంటనష్టంపై నిజాయితీగా సమీక్షించామని.. అకాల వర్షాల వల్ల రైతులకు కొంత పంట నష్టం జరిగిందన్నది నిజమేనని ప్రకటించారు. ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది.. ఎంత మేర రైతులు నష్టపోయారో కూడా చెప్పలేదు.
కానీ డిసెంబర్ 31లోగా పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇస్తామని ప్రకటించారు. నష్టపరిహారం అంటే.. ఇన్పుట్ సబ్సిడీ. ప్రత్యేకంగా పంటలకు పరిహారం ప్రకటించలేదు. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని.. నష్టపోయిన రైతులకు 80 శాతంపై సబ్సిడీ విత్తనాలు ఇస్తామని ప్రకటించారు. తుపానుతో నష్టపోయిన మత్స్యకారులను ఆదుకుంటామన్నారు. వీటి తర్వాత జగన్మోహన్ రెడ్డి తాము రైతులకు ఏయే పథకాలు అమలు చేస్తున్నారో చెప్పుకొచ్చారు కానీ.. ప్రస్తుత నివార్ తుపాను గండం కారణంగా నష్టపోయి నరైతులు.., ప్రజలకు మాత్రం.. ప్రత్యేకంగా రూపాయి సాయం అందే అవకాశం కూడా కనిపించడం లేదు.