స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి నాయకత్వం వహించే ఆఫర్‌ను ముఖ్యమంత్రి జగన్‌కే ఇచ్చేందుకు అన్ని పార్టీల నేతలు అంగీకరించారు. స్వయంగా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కూడా.. జగన్మోహన్ రెడ్డి.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి జగన్ నాయకత్వం వహిస్తే ఆయన వెనుక నడవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. కంటి తుడుపుగా ఒక్క లేఖ రాసి.. తాను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం అంటే… ప్రజలు నమ్మబోరని… ముందుకు వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలని అంటున్నారు. రాజీనామాలకు కూడా సిద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిస్తున్నారు. వైసీపీ నేతలు సై అంటే.. తమ పార్టీలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి సిద్ధంగా ఉన్నారని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆమరణదీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయనను పరామర్శించేందుకు చంద్రబాబు విశాఖ వెళ్లారు.
ఈ సందర్భంగా జగన్‌కు చంద్రబాబు ఆఫర్ ఇచ్చారు. ఇతర పార్టీల నేతలు కూడా.. జగన్మోహన్ రెడ్డి ఉద్యమంలో లీడ్ తీసుకోవాలని కోరుతున్నారు. కానీ వైసీపీ మాత్రం జగన్ లేఖ రాశారని.. చంద్రబాబు అది కూడా చేయలేదని విమర్శలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి.. ప్రజల్లోకి రాలేదు. స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభిస్తే.. ఆయనకు మంచి మైలేజీ వచ్చే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పటికే సీఎం జగన్ కేసుల భయంతో ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్నారని.. కేంద్రం వద్ద.. ఏపీ ప్రయోజనాల కోసం కనీసం విజ్ఞప్తులు కూడా చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని నడిపించడాని ముఖ్యమంత్రి హోదాలో ముందుకు వస్తే వీటన్నింటికీ ఒక్క సారిగా చెక్ పెట్టినట్లుగా అవుతుందని వైసీపీ నేతలు కూడా అంచనా వేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా అదే కోరుతున్నారు. అధికారంలో ఉన్న వారు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తేనే… కేంద్రం తన ఆలోచనపై వెనక్కి తగ్గుతుందని లేకపోతే.. లైట్ తీసుకుంటుందని వారంటున్నారు. ఇప్పుడు.. జగన్మోహన్ రెడ్డికి అనూహ్యమైన అవకాశం వచ్చిందని అంటున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది. ఆయన విశాఖ ప్రయటనలో స్టీల్ ప్లాంట్ జేఏసీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా కేంద్రంపై పోరాడతానని హామీ ఇస్తారో లేదో చూడాలి..!