ఇప్పటివరకు అనేక రకాల హామీలు ఇస్తూ, ప్రతి ఒక్క వర్గానికి విపరీతంగా వరాలు ప్రకటిస్తూ కొనసాగుతున్న జగన్, ఇప్పుడు మరొక ప్రతిపాదన చేశారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి, గ్రామాల్లోని ప్రతి 50 ఇళ్లకు ఒక ప్రభుత్వ వాలంటీర్ నియమించి, ఆ వాలంటీర్లు 50 ఇళ్లకు కావాల్సిన అన్ని పనులను చేసి పెట్టేలా కొత్త పథకాన్ని జగన్ రూపొందించారు. యధావిధిగా జగన్ అభిమాన విశ్లేషకులు ఇది చాలా గొప్ప పథకం అని ప్రచారం చేసుకుంటూ ఉంటే, ప్రజానీకం మాత్రం ఈ వృధా ఖర్చులు అంతా తర్వాత తమ మెడకే గుదిబండలా చుట్టుకుంటాయి అని తలలు పట్టుకుంటున్నారు.
రాష్ట్ర బడ్జెట్ దాటుతున్న జగన్ హామీలు:
జగన్ ప్రతి వర్గానికి వరాలు కురిపిస్తూనే ఉన్నారు. మత్స్యకారులకు సీజన్ లేని కాలంలో ప్రతి నెల పదివేల రూపాయల పెన్షన్ ఇస్తాం అని గతంలో ప్రకటించి ఉన్నారు. అలాగే వారికి బోట్లు కొనడానికి ఇంకా ఇతరత్రా రక రకాల పనులకు డబ్బులు ఇస్తామని ప్రకటించి ఉన్నారు. అలాగే ఆటోడ్రైవర్లకు కూడా సంవత్సరానికి ఒకసారి ఆటో రిపేరు నిమిత్తం, మరి ఇతరత్రా ఖర్చుల నిమిత్తం సంవత్సరానికి ప్రతి ఆటో డ్రైవర్ కు పదివేల రూపాయలు ఇస్తామని ప్రకటించి ఉన్నారు. మచ్చుకు ఈ రెండే కానీ ఇలా ప్రతి వర్గానికి, ఏడాదికి వేలకు వేల రూపాయలు ఇస్తామని జగన్ ప్రకటించి ఉన్నారు. జగన్ హామీలు నెరవేరాలంటే రాష్ట్ర బడ్జెట్ కాదు దేశ బడ్జెట్ కూడా సరిపోదని తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పట్లో విమర్శలు చేసారు.
ఏంటి ఈ గ్రామ సచివాలయం పథకం:
జగన్ ఇప్పుడు ప్రకటించిన ఈ కొత్త పథకం ఏమిటంటే, గ్రామ సచివాలయాలు ప్రతి ఊరులోనూ ఏర్పాటు చేసి, ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీరు ని నియమిస్తారు. ఈ వాలంటీర్లు ఊర్లో ఎవరికి పెన్షన్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డ్ ఇలాంటి ఏ పనులు కావాలన్నా వీరే దగ్గరుండి ప్రజలకు చేసిపెడతారన్న మాట. అందుకుగాను జగన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటైతే ఇలాంటి వాలంటీర్లకు నెలకు ఐదు వేల చొప్పున జీతం ఇస్తారట. ఇది జగన్ ప్రతిపాదన.
దీనికి ఎంత ఖర్చు అవుతుంది:
అయితే ఈ రాష్ట్రంలో ఎన్ని వేల గ్రామాలు ఉన్నాయో, అన్ని గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ని పెట్టి నెలకు 5000 ఇవ్వడం అంటే అది ఎంత ఖర్చు అవుతుందో అన్న విషయం మీద జగన్ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే, ఆంధ్రప్రదేశ్లో 676 మండలాలు ఉన్నాయి. సుమారుగా ఒక్కొక్క మండలంలో 15 నుంచి 20 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటిలోను ఇలాంటి వాలంటీర్లను నియమించాలంటే, నెలకు సుమారుగా రెండు వందల కోట్లు వీరి జీతాలు చెల్లించాలన్నమాట. ఇంతా చేసి ఈ వాలంటీర్లు చేసేది ఏమిటంటే, మనకు అవసరమయే రేషన్ సరుకుల ని, ఇంకా ఇతరత్రా ప్రభుత్వ పనులను హోమ్ డెలివరీ చేస్తారట.
తలకి సమస్య వస్తే జగన్ మోకాలికి చికిత్స చేస్తున్నారా?
నిజానికి గ్రామస్థాయిలో అధికారులతో పనిచేయించుకోవడం ప్రజలకు కాస్త కష్టమైన విషయమే. అడుగడుగునా అవినీతి పెరిగిపోవడమే కాకుండా, ప్రభుత్వ అధికారులు గ్రామస్తులతో వ్యవహరించే తీరు కూడా గ్రామస్తులు పనులు చేయించుకునే విషయంలో ఇబ్బందులు పడడానికి కారణం అవుతుంది. ఈ సమస్యకు చికిత్స వాలంటీర్లను నియమించటం కాదు. అధికారులలో అవినీతి తగ్గించేలా చేయడం, వీలైనంతవరకు ఇలాంటి పనులన్నింటినీ సాంకేతిక పరిజ్ఞానంతో ఆటోమేట్ చేయడం, గ్రామస్థాయిలో సరైన అంబుడ్స్మెన్ వ్యవస్థ ఏర్పాటు చేయడం లాంటివి ఈ సమస్యకు పరిష్కారాలు. అయితే జగన్ ఈ సమస్యకు సరైన పరిష్కారం వెతకడం మానేసి కొత్త సమస్యలు సృష్టించే ప్రతిపాదనలను చేస్తున్నారు.
మొత్తం మీద:
జగన్ కి ఎవరు ఇటువంటి సలహాలు ఇస్తున్నారో తెలియడం లేదు కానీ, ప్రజలకు నిజంగా అవసరమైన అనేక సమస్యలను వదిలేసి, ఇలాంటి పస లేని అంశాలపై జగన్ కసరత్తు చేయడమే కాకుండా, అదేదో అద్భుతమైన పథకం అయినట్టు ప్రకటనలు చేస్తున్నారు. దానికి గ్రామ సచివాలయం లాంటి పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు. ఇప్పటికే ఆదాయ వనరులు తగ్గిపోయిన రాష్ట్రం గా మారిన ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి పథకాలు ప్రజల తలకే గుదిబండలుగా చుట్టుకుంటాయి. నెలకు వీరికి చెల్లించే ఈ వందల కోట్ల జీతాలను తిరిగి ఇదే ప్రజల నుంచి వసూలు చేయవలసి ఉంటుంది. జగన్ చేస్తున్న ఇటువంటి హామీల కారణంగా అర్బన్ ఓటర్లు జగన్ కు మరింత దూరంగా జరుగుతున్న విషయం వైఎస్ఆర్సిపి నేతలకు అర్థం కావడం లేదు.