ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. దశలవారీగా మద్యనిషేధం విధిస్తామని నవరత్నాల్లో ఓ రత్నంగా హామీ ఇచ్చారు. దాని కోసం.. ఆయన ఏపీలో సంపూర్ణంగా మద్యం విధానాన్ని మార్చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న దుకాణదారుల లైసెన్స్‌లను అక్టోబర్ వరకు పొడిగించి… ఆ తర్వాత మాత్రం.. ప్రభుత్వమే.. షాపులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని… అక్కచెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తానని మాట ఇచ్చాను. నిషేధం దిశగా అడుగులేస్తూ బెల్టుషాపుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని ప్రకటించారు. మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ చట్టాన్ని తెచ్చామని.. ఇలా చేయడం ద్వారా గ్రామాల్లో బెల్టుషాపులు పూర్తిగా మూతబడతాయన్ని ట్విట్టర్ వేదికగా.. ప్రకటించారు.
ప్రభుత్వం షాపులు.. నిర్వహిస్తే.. మద్యం వినియోగం తగ్గిపోతుందా.. అన్న డౌట్ ఎవరికైనా వస్తే.. దానికి ముఖ్యమంత్రి జగన్…ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. నిజానికి బెల్ట్ షాపులు.. దుకాణాల లైసెన్స్ దారులు… తమ దుకాణం పరిధిలో ఏర్పాటు చేసుకునే చిన్న చిన్న విక్రయకేంద్రాలు. ఇలాంటి చోట్ల చీప్ లిక్కర్ ఎక్కువగా అమ్ముతూ ఉంటారు . వీటిని తొలగించి ప్రజలకు మేలు చేస్తానని జగన్ చెప్పారు. అయితే… జగన్ ట్వీట్ తేడాగా ఉందన్న కామెంట్లు… నెటిజన్ల నుంచి వస్తున్నాయి. మద్యం విధానంలో క్లారిటీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా జగన్ ట్వీట్‌పై సెటైర్లు వేశారు. “మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయి” “మద్యం అమ్మకాల బాధ్యత ప్రభుత్వానిదే” అని ఒకదానితో ఒకటి పొంతన లేని స్టేట్మెంట్లు ఇచ్చారు, అసలింతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని జగన్‌ను ప్రశ్నించారు.
మొదటి బడ్జెట్లో మద్యం మీద ఆదాయాన్ని గత ఏడాదికన్నా 2,297 కోట్లు ఎక్కువ అంచనా వేసారని లోకేష్ ట్వీట్లో గుర్తు చేశారు. మద్యం అమ్మకాల్ని పెంచుతామని చెప్పడం అంటే.. ప్రజలతో మరింత గా మద్యం కొనుగోలు చేయిస్తామని చెప్పడమేనని.. మరి ఎలా నియంత్రించడం అవుతుందన్న.. సందేహం చాలా మందికి వస్తోంది. దీనికి ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని, అక్కచెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తానని మాట ఇచ్చాను. నిషేధం దిశగా అడుగులేస్తూ బెల్టుషాపుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ చట్టాన్ని తెచ్చాం. తద్వారా గ్రామాల్లో బెల్టుషాపులు పూర్తిగా మూతబడతాయి.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 25, 2019