2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి చంద్రబాబు చేసిన తప్పులన్నింటినీ ఎన్ని రకాలుగా హైలైట్ చేయాలో అన్ని మార్గాలనూ వాడేశాడు జగన్. ఇప్పటికీ అసెంబ్లీతో సహా ఎక్కడ మాట్లాడే అవకాశం వచ్చినా చంద్రబాబు చేసిన తప్పులను హైలైట్ చేసే అవకాశాన్ని అస్సలు వదులుకోవడం లేదు జగన్. ప్రత్యేక హోదా సభలు, కరువు యాత్ర, రైతు భరోసా యాత్ర, తన ట్రేడ్ మార్క్ ఓదార్పు యాత్ర…..ఇలా ఎప్పుడు ప్రజల ముందుకు వెళ్ళినా చంద్రబాబు చేసిన తప్పులను మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాడు జగన్. ఇప్పుడు కొత్తగా లేఖాస్త్రాలను సంధించడం మొదలు పెట్టాడు. రీసెంట్గా నిరుద్యోగ భృతి గురించి నిలదీసిన జగన్…తాజాగా చంద్రబాబు చాలా పెద్ద దొంగ అన్న అర్థం వచ్చేలా అసెంబ్లీ స్పీకర్‌కి లేఖరాశాడు. మరోసారి ఓటుకు నోటు కేసు ప్రస్తావన తీసుకుని వచ్చాడు. తెలంగాణా రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీలో ఉన్నప్పుడు ఒక దొంగతనం చేస్తూ ఆడియో, వీడియో సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఆ అసెంబ్లీని ఖాళీ చేసి ఇప్పుడు కొత్త అసెంబ్లీకి వస్తున్నారని చెప్పుకొచ్చాడు జగన్. ఈ కొత్త అసెంబ్లీకి కూడా ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనే దొంగసొత్తుతో వస్తున్నాడని, ఆ దొంగసొత్తుకు సంబంధించి మీరు ఇప్పుడైనా నిర్ణయం తీసుకుంటారా అని ప్రశ్నించాడు జగన్. గోడదూకిన ఎమ్మెల్యేలను దొంగసొత్తుతో పోల్చాడు జగన్.
వైఎస్ జగన్ తన లేఖలో ప్రస్తావించిన రెండు అంశాలపైనా చంద్రబాబు తప్పకుండా స్పందించాల్సిందే. రేవంత్‌రెడ్డి ఇష్యూలో ‘బ్రీఫ్డ్ మీ’ వాయిస్ తనది కాదు అని కూడా గట్టిగా చెప్పలేకపోతున్నాడు చంద్రబాబు. అక్కడే కేసు గురించి చాలా మందికి స్పష్టత వచ్చేస్తోంది. నిప్పులా బ్రతికాను, అవినీతి సొమ్మును అస్సలు ముట్టలేదు అని అస్తమానం చెప్పుకుంటూ ఉండే చంద్రబాబును ఈ కొనుగోలు వ్యవహారం బాగానే ఇబ్బందిపెడుతోంది. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కూడా టిడిపి నుంచి టిఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి ఘాటుగా విమర్శలు చేశాడు చంద్రబాబు. నెల తిరిగేసరికి ఆంధ్రప్రదేశ్‌లో ఫిరాయింపు రాజకీయం మొదలెట్టాడు. ఎమ్మెల్యేలు పార్టీలు మారడం పెద్ద విషయం కాదు గానీ….పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీలోకి జంప్ చేస్తే కొంచెం గౌరవంగా ఉంటుంది. ఎన్టీఆర్‌కి నైతిక విలువలు లేవు అని ఇండియా టుడే మేగజైన్కి చాలా పెద్ద ఇంటర్యూ ఇచ్చాడు చంద్రబాబు. ఈ ఫిరాయింపు వ్యవహారం కూడా కచ్చితంగా నైతిక విలువలకు సంబంధించిన విషయమే. అమరావతి బ్రాండ్‌ని ఆకాశమంత ఎత్తుకు పెంచుతున్నాను అని చెప్పుకుంటున్న చంద్రబాబు…..ఆ అమరావతి అసెంబ్లీలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలిసి అడుగుపెట్డడం అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం మాత్రమే కొత్తది అని అనుకోవాలి. రాజకీయం అంతా కూడా పాచిపోయిన పాత వ్యవహారమే అని చెప్పుకోవాలి. నేను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు ఈ ఫిరాయింపు తప్పును 2019 వరకూ మోస్తూనే ఉంటాడో…లేక కడిగేసుకునే ప్రయత్నం చేస్తాడో చూడాలి. తను హాజరైన సభలు అన్నింటిలోనూ నైతిక విలువల గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్న స్పీకర్‌కి కూడా ఈ విషయంలో స్పందించాల్సిన బాధ్యత ఉంది. అలా కాకుండా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోకపోతే మాత్రం…..వల్లించే విలువలకు….చేతలకు సంబంధం లేకుండా పోతుంది. మాటలు, చేతలు ఒక్కలా ఉంటేనే ‘నిప్పులాంటి మనిషి’ అని అంటారన్న విషయం అత్యంత అనుభవజ్ఙుడిని అని చెప్పుకుంటూ ఉన్న చంద్రబాబుకు మాత్రం తెలియదా?