చాలా కాలంగా… టాలీవుడ్ ఏపీకి దూరమైంది. చిత్రసీమ అంతా హైదరాబాద్ చుట్టూనే తిరగడం, ఇక్కడే ప్రధానమైన స్టూడియోలు ఉండడంతో.. ఏపీ వైపు ఎవరూ చూడడం లేదు. మహా అయితే విశాఖపట్నం వెళ్తున్నారు. బీచ్ అందాల కోసం. పల్లెటూరి కథైతే.. అమలాపురం, రాజోలు అంటూ ఓ పది, పదిహేను రోజుల ట్రిప్వేస్తున్నారు. అవి కూడా చిన్న సినిమాల వరకే. స్టార్లున్న సినిమా అయితే.. పల్లెటూరి కథంటూ వస్తే.. పొల్లాచ్చీ పోతున్నారు. పెద్ద సినిమాలు ఏపీలో షూటింగ్ చేసిన దాఖలాలు చాలా తక్కువ. దీనిపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏపీలో షూటింగ్ చేయాల్సిందే.. అంటూ నిర్మాతలకు షరతులు విధిస్తోంది. ఈ మేరకు.. సీఎం జగన్ కూడా ఈరోజు జరిగిన మీటింగ్ లో తన అభిప్రాయం బల్లగుద్దినట్టు మరీ చెప్పారని తెలుస్తోంది.
సగం సినిమా ఏపీలో చేయాలని, అలాంటి సినిమాలకే సబ్సీడీలు, 5వ ఆటకు అనుమతులూ, టికెట్ రేట్ల పెంపులో మినహాయింపులు ఇస్తామని స్పష్టం చేసినట్టు సమాచారం. కనీసం 20 శాతం షూటింగ్ జరపాలని, లేని పక్షంలో.. పరాయి రాష్ట్రం నుంచి వచ్చిన సినిమాలానే చూస్తామని జగన్ చెప్పార్ట. ఏపీలో షూటింగులు చేసుకోవడానికి మేం రెడీ అంటూ.. సినిమా పెద్దలు చెప్పారని, దాంతో జగన్ సంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. అయితే ఏపీలో సరైన స్టూడియోలు లేవు. విశాఖలో రామానాయుడు స్టూడియో ఉన్నా… అందులో సకల సదుపాయాలూ లేవు. చాలా కాలంగా అక్కడ షూటింగులు జరగడం లేదు. కొత్త స్టూడియోలకు అనుమతి లభిస్తే.. స్టూడియోల సంఖ్య పెరిగితే కచ్చితంగా ఏపీలో షూటింగులు చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పటికే కొంతమంది అగ్ర కథానాయకులు, నిర్మాతలు ఏపీలో స్టూడియోల కోసం స్థలాలను ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్లందరికీ అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది.