ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న ఏపీ విపక్ష నేత జగన్ ప్రతీ శుక్రవారం విచారణ కోసం కోర్టుకు హాజరు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే నెల రెండో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు బయలుదేరుతున్నారు. ఓపక్క యాత్ర చేస్తూ ప్రతీవారం కోర్టుకు హాజరు కావాడం కచ్చితంగా ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే, రాబోయే ఆర్నెల్లపాటు విచారణ నుంచి మినహాయింపు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. తాను ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నాననీ, అందుకే విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై స్పందించిన కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు వేసింది. కోర్టుపై న్యాయవ్యవస్థపై గౌరవం ఉన్న పౌరునిగా ప్రతీ శుక్రవారం హాజరు కావాలని కోర్టు అభిప్రాయపడింది. వారంలో ఐదురోజులు పాదయాత్ర చేసుకుని, శుక్రవారం నాడు కోర్టు హాజరైతే విశ్రాంతి తీసుకున్నట్టుగా ఉంటుంది కదా అని న్యాయమూర్తి అన్నారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా పాదయాత్ర షెడ్యూల్ ఎలా ఖరారు చేసుకున్నారంటూ ప్రశ్నించారు. అయితే, జగన్ తరఫు న్యాయవాది అభిప్రాయం ఎలా ఉందంటే… జగన్ పాదయాత్రకి ప్రతీ శుక్రవారం విరామం ఇస్తే, దాని తీవ్రత ప్రభావవంతంగా ఉండదని కోర్టుకు చెప్పారు! న్యాయస్థానం మార్గదర్శకాలను పాటిస్తామన్నారు. ఈ వాదోపవాదాలు విన్న తరువాత తీర్పును సోమవారానికి వాయిదా వేశారు.
పాదయాత్రకు సంబంధించి కోర్టు ముందు జగన్ వినిపించిన వాదనా.. ప్రజల ముందు వినిపిస్తున్న వాదనల్లో చాలా తేడా ఉంది! ప్రజల కోసమే పాదయాత్ర చేస్తున్నా అంటూ కోర్టులో చెబుతున్నారు. విచారణ నుంచి మినహాయింపును కూడా ఈ ప్రజా కోణం నుంచే కోరుతున్నారు. ఆయన యాత్ర చేయడం ప్రజలకు అవసరం అన్నట్టుగా అభిప్రాయపడుతున్నారు. కానీ, జగన్ పాదయాత్ర లక్ష్యం చంద్రబాబు సర్కారు పునాదులు కదలదీయడం కదా! టీడీపీ ప్రభుత్వాన్ని పడగొట్టడం కదా! సంవత్సరంలోపు అందరూ మెచ్చుకునే ‘అన్నయ్య’గా ముఖ్యమంత్రి కావడం కదా! దీని కోసమే ప్రార్థనలు చేయండీ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు కదా. ఈ యాత్ర జగన్ కు రాజకీయావసరం అనేది సుస్పష్టం. కానీ, ఏపీలో ప్రజల తరఫున పోరాడాల్సి ఉందనీ, ప్రతిపక్ష నేతగా ప్రజలు కష్టాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందనీ, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలని ఓదార్చాల్సిన అవసరం ఉందనీ, అందుకే ప్రతీ శుక్రవారం వ్యక్తిగత హాజరీ నుంచీ మినహాయింపు కావాలంటూ కోర్టు ముందు వాదన వినిపిస్తున్నారు!
ప్రతిపక్ష నేతగా ప్రజలు కష్టాలు తెలుసుకోవాల్సిన అవసరం కచ్చితంగా ఉంటుంది. అయితే, గడచిన మూడున్నరేళ్లూ ఆ పాత్ర పోషించలేదా..? ప్రజల సాధబాధకాలు తెలుసుకునే ప్రయత్నం ఇన్నాళ్లూ చేయలేదా..? ప్రతిపక్ష నేతగా ఇప్పటివరకూ ఏం చేయలేకపోయానూ.. రాబోయే ఈ ఆర్నెల్లలోనే ప్రజల కష్టాలను తెలిసేసుకుంటానూ అన్నట్టుగా ఆయన వాదన వినిపిస్తోంది. కేవలం కోర్టు దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రమే ఈ యాత్ర ‘ప్రజల కోసం’ అనే సౌండ్ వినిపిస్తోంది. జగన్ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్న గుంటూరు ప్లీనరీ నుంచి మొన్నటి ధర్మవరం సభ వరకూ ఒకే లక్ష్యం చెబుతూ వస్తున్నారు. చంద్రబాబు సర్కారు పునాదుల కదలిక, ముఖ్యమంత్రి కుర్చీలో జగన్ కూర్చోవటం. అంతకుమించి, ప్రజా సమస్యల కోణం అనేది పాదయాత్ర ప్రాధాన అజెండాగా వారే చూపించడం లేదు!