ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విశాఖ జిల్లాలో కొనసాగుతోంది. టీడీపీపై విమర్శలూ ఆరోపణలు తప్ప జగన్ ప్రసంగంలో కొత్త అంశాలంటూ ఏవీ లేవు. అయితే… ఈ మధ్య భాజపాతో టీడీపీ తెగతెంపులు చేసుకున్న అంశాన్ని జగన్ పదేపదే ప్రస్థావిస్తున్నారు. సబ్బవరంలో మరోసారి అదే అంశమై మాట్లాడుతూ… భాజపా టీడీపీలు ఒకరినొకరు గొప్పగా పొగుడుకున్నారన్నారనీ, నాలుగేళ్లపాటు మొదటి భార్య భాజపాతో టీడీపీ కాపురం బాగానే కొనసాగిందనీ, చిలకాగోరింకల్లా సంసారం చేసుకున్నారన్నారు. ఇప్పుడు భాజపాతో విడాకులు తీసుకున్నాక, ఆ పార్టీ చెడ్డదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారని విమర్శించారు. విడాకులు తీసుకున్న ఈ పెద్ద మనిషి ప్రతీదానికీ మొదటి భార్యదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 2014లో జగన్ కి ఓటేస్తే కాంగ్రెస్ కి ఓటేసినట్టే అని ప్రచారం చేశారనీ, ఇప్పుడు జగన్ కి ఓటేస్తే భాజపాకి ఓటేసినట్టే అంటున్నారని వ్యాఖ్యానించారు.
గతంలో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి, ఇప్పుడు తెంచుకుని టీడీపీ ఇలా విమర్శలు చేస్తుండటం తప్పు అన్నట్టుగా జగన్ అభిప్రాయం ఉంటోంది. గతంలో భాజపాని పొగిడారూ, ఇప్పుడు తెగుడుతున్నారూ అని మాత్రమే జగన్ చెబుతున్నారు. కానీ, ఈ క్రమంలో మారిన రాజకీయ పరిస్థితి గురించీ, ఆంధ్రాకి చేస్తామన్నవి చెయ్యని కేంద్రం తీరు గురించి విమర్శించడం లేదు. టీడీపీకి భాజపా దూరం కావడం అనేది అదేదో తెలుగుదేశం పార్టీ తప్పుగానో, లేదంటే ఆ పార్టీ సొంత వ్యవహారంగా మాత్రమే జగన్ చూస్తున్నట్టున్నారు. విభజన హామీలన్నీ ఆంధ్రాకు సక్రమంగా కేంద్రం ఇచ్చి ఉంటే… భాజపాతో తెగతెంపులు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొస్తుంది..? భాజపాతో పొత్తు తెగిపోవడానికి ప్రేరేపించిన పరిస్థితులు ఎటువైపు నుంచి ఉత్పన్నమయ్యాయి..? ఇవన్నీ ప్రజలకు తెలుసు.
ఒక పార్టీతో పొత్తు తెగిన తరువాత.. పొత్తుకు ముందూ, తరువాత ఆయా పార్టీల మధ్య విమర్శల్ని బేరీజు వేసుకుంటే గతానికి భిన్నంగానే కనిపిస్తాయి. ఆ తేడాని ఇప్పుడు జగన్ పదేపదే ప్రస్థావించడం… అదొక్కటే జరిగిపోతున్న అన్యాయం అన్నట్టుగా ప్రజలకు వివరించడం వల్ల ప్రయోజనం ఏముంటుంది..? ‘గతంలో భాజపాని చంద్రబాబు పొడిగాడు, ఇప్పుడు విమర్శిస్తున్నారు’… ఈ ఒక్కమాటను పట్టుకుని ఎన్ని విమర్శలు చేసినా పార్టీపరంగా వైకాపాకిగానీ, ప్రయోజనాలపరంగా ప్రజలకిగానీ ఏం ఉపయోగం..? అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన కేంద్రమే రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసింది. దీన్నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలన్నదే ప్రజల్లో జరుగుతున్న చర్చ. కాబట్టి, జగన్ మాట్లాడుతున్న ‘ఈ మొదటి భార్య, రెండో భార్య’ టాపిక్ వల్ల అనూహ్యంగా ప్రజల్లో ఏదో చర్చ జరిగిపోతుందని వైకాపా వ్యూహకర్తలు అనుకుంటే.. అంతకంటే అవివేకం మరొకటి ఉండదు. పరిస్థితులనూ అవసరాలనూ వాస్తవిక దృక్పథంతో ప్రజలు చూస్తుంటారని మరచిపోతే ఎలా..? రాష్ట్రంలో కేంద్రం క్రియేట్ చేసిన క్లిష్ట పరిస్థితుల కోణం నుంచి జగన్ మాట్లాడితే.. కొంతైనా ప్రభావవంతంగా ఉంటుంది.