ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తయింది. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి బాటలోనే యాత్ర సాగించాననీ, ఆయన చల్లని దీవెనలు పైనుంచి ఉంటాయని ఇచ్ఛాపురంలో జరిగిన సభలో జగన్ అన్నారు. తనకు ముప్ఫై సంవత్సరాలు పాలించాలని ఆశ ఉందనీ, ఆ తరువాత చనిపోతే నాన్న ఫొటోతోపాటు తన ఫొటో కూడా ప్రతీ ఇంట్లోనూ ఉండాలన్నదే తన ఆశ అన్నారు జగన్. 2003లో దివంగత వైయస్సార్ పాదయాత్ర చేసినట్టుగానే… జగన్ యాత్ర చేశారు. ఆనాడు యాత్ర చేసిన వైయస్సార్ తరువాతి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, జగన్ విషయంలో అదే రిపీట్ అవుతుందన్న ధీమా వైకాపా వర్గాల్లో ఇప్పుడు బాగా ఉంది. అయితే, తండ్రి మాదిరిగా నడవడం వేరు, ఆయన బాటలో నడుచుకోవడం వేరు!
2003లో నాటి పాదయాత్ర సందర్భంగా దివంగత వైయస్సార్ ఏమన్నారంటే… ‘ప్రజల ఆలోచన ఏవిధంగా ఉందనేది మేం గమనించి, వారి ఆలోచన ప్రకారమే ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి చేసే ప్రయత్నం, ఆరోజు (భవిష్యత్తులో) ఉండే ప్రభుత్వాలు ఎలా ఉండాలనేది మేం తెలుసుకునే ప్రయత్నమే ఈ ప్రజాప్రస్థానం ముఖ్యోద్దేశం’ అన్నారు. పాదయాత్ర గురించి వైయస్సార్ చేసిన కామెంట్ ఇది. దీనికీ జగన్ యాత్ర ముఖ్యోద్దేశానికీ ఉన్న తేడా ఏంటో అందరికీ తెలిసిందే. నేను ముఖ్యమంత్రి అయిపోతా, ముప్ఫయ్యేళ్లు పాలించేస్తా అనలేదు ఆయన!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ మధ్య ఓ సందర్భంలో మాట్లాడుతూ… రాజశేఖర్ రెడ్డి మాటలు కొంత పరుషంగా ఉంటాయిగానీ, ఆ మాటల్లో వినయం కనిపించేదన్నారు. తొలిసారిగా జగన్ శాసన సభ్యుడైన జగన్ మాటలు వింటుంటే, బాధా ఆవేదన కలుగుతాయన్నారు. జగన్ పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర్నుంచీ, ముగించే వరకూ సీఎం చంద్రబాబుపై విమర్శలకే ప్రాధాన్యత ఇచ్చారు. బంగాళాఖాతంలో కలిపేస్తామన్నారు, ఉరి శిక్ష విధించినా తప్పు ఉందా అనీ, నడిరోడ్డు మీద కాల్చినా తప్పులేదనీ… ఇలా విమర్శలు చేస్తూ చేస్తూ ఇవాళ్టి నారాసురుడు అంటూ వ్యాఖ్యానించడం వరకూ ఎక్కడ చూసుకున్నా హుందాతనం జగన్ ప్రసంగాల్లో కనిపించలేదు! రాజశేఖర్ రెడ్డి చేసిన అప్పటి పాదయాత్రలో ఇంతటి దారుణంగా వ్యక్తిగత ఆరోపణలు లేవు.
పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని, తద్వారా అజెండా రూపకల్పన చేసేందుకు నాడు వైయస్ ప్రయత్నించారు. కానీ, జగన్ ముందుగానే తానొక అజెండా తయారు చేసుకుని ప్రజల్లోకి వెళ్లారు. తాను కూడా ప్రజల కష్టాలను తెలుసుకోవాడికే అని జగన్ కూడా యాత్ర ప్రారంభించినా… ప్రజలతో మమేకమై మాట్లాడినా, తను అనుకున్న విధానాలను ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసే ప్రయత్నమే చేశారు. యాత్ర పూర్తికాముందే నవరత్నాలు అంటూ ప్రచారం మొదలుపెట్టారు. పాదయాత్ర తరువాత ప్రజలు దిద్దిన మేనిఫెస్టో తయారు చేస్తా అని మొదలుపెట్టి, యాత్ర పూర్తయ్యేసరికి సొంత మేనిఫెస్టో ప్రజలకు చెప్పేశారు!
వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసే నాటికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులే ఇప్పుడూ ఉన్నాయి కాబట్టి జగన్ పాదయాత్రకి బయల్దేరాల్సి వచ్చిందని మొన్ననే విజయమ్మ అన్నారు. వాస్తవానికి అప్పటి ప్రజల ఆకాంక్షలకీ, ఇప్పటి పరిస్థితులకూ సంబంధమే లేదు. విభజిత రాష్ట్రం, భాజపా చేతిలో నిర్లక్ష్యానికి గురైన రాష్ట్రం. వైయస్ పాదయాత్ర చేసే నాటికి అధికార మార్పే అప్పుడు ప్రజలు కోరుకున్నది. కానీ, ఇప్పుడు ప్రజల ఆకాంక్ష… అభివృద్ధి. కాబట్టి, ఎలా చూసుకున్నా జగన్ యాత్రకీ, వైయస్ పాదయాత్రకీ పోలిక కుదరదు అనేది వాస్తవం.