ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర 13వ రోజుకి చేరుకుంది. మొదటి రోజు నుంచే హామీల వర్షం కురిపిస్తూ వస్తున్నారు. ‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే’ అంటూ మొదలుపెట్టి ఏమేం చేయబోతున్నారో చెబుతున్నారు. పిల్లల్ని బడికి పంపిస్తే డబ్బులిస్తారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ తోపాటు ఇతర ఖర్చులకు కూడా డబ్బులిస్తారు. పెన్షన్ వయసును 45 ఏళ్లకు తగ్గిస్తారు. అవ్వా తాతలకు రూ. 2000 పెన్షన్ ఇస్తారు. ఒకవేళ ఈలోగా సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ ను రూ. 2000కు పెంచితే, జగన్ వచ్చాక రూ. 3000 చేస్తారు. వైద్యానికి డబ్బులిస్తారు. చికిత్స తరువాత ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకున్న రోజులకు కూడా డబ్బులిస్తారు. అన్నిటికీ డబ్బూ డబ్బూ డబ్బూ… దేనికైనా సరే డబ్బే!
ప్రతిపక్ష నేతను పనిగట్టుకుని విమర్శించాలన్నది ఉద్దేశం కాదుగానీ… ఆయన పాదయాత్ర సందర్భంగా ఇస్తున్న హామీలూ చేస్తున్న వాగ్దానాలు ప్రతీరోజూ వింటుంటే కొంత ఆవేదన కలుగుతోంది. నాయకుల దృష్టిలో ప్రజలు అంటే మరీ ఇంత ‘ఇదా’ అనే ఆవేదన కలుగుతోంది! మన నాయకులు ప్రజలను ఎదగనివ్వరా..? కనీసం ఆత్మాభిమానంతో బతికే పాలనను కూడా అందివ్వరా అనే ఆందోళన పెరుగుతోంది. పేద వృద్ధులకు పెన్షన్లు ఇవ్వండి.. తప్పులేదు. కానీ, ఆ వయసును 45 కుదించేస్తే… ఏమని చెబుతున్నట్టు! ఆ వయసు దాటాక పని చెయ్యొద్దనా.. ఆ వయసు దాటినవారు పనులకు పనికిరారనా..? 45 ఏళ్లకే వృద్ధాప్యాన్ని అంటగట్టేస్తారా..? ఇక, పెన్షన్ విషయానికొస్తే.. చంద్రబాబు రూ. 2 వేలు చేస్తే… ఈయన రూ. 3 వేలు చేస్తారట. సరే. ఒకవేళ చంద్రబాబు రూ. 2 వేలు చేయకుంటే… ఈయనా రూ. 3 వేల వరకూ పెంచరనే కదా అర్థం. ఈ క్రమంలో ఒక వృద్ధుడి అవసరాలు అనే యాంగిల్ ఎక్కడుంది..? వయసు మళ్లిన వారిపై నాయకుల ప్రేమ ఇంతేనా..? వారి అధికార దాహం కోసం ముసలాళ్లకు డబ్బులు ఇస్తున్నట్టుగా ఉంది. ఈ ఇస్తున్న విధానానికి ‘పెన్షన్’ అని పేరు పెడుతున్నట్టుంది.
ఇవే కాదు.. ఇతర హామీలు ఏవి తరచి చూసినా.. అంతిమంగా కనిపిస్తున్నది ఒక్కటే… పార్టీలు విసిరే ఇలాంటి ‘సంక్షేమ పథకాలు’ అనబడే ఈ ‘డబ్బు’ రూపేణా అందే సాయం కోసం ప్రజలు ఎదురు చూడాలి. ప్రజలకు మేలు చేయడం అంటే డబ్బు రూపంలో మాత్రమేనా..? ప్రభుత్వాల నుంచి, లేదా ఈ నాయకుల నుంచి ప్రజలు ఆశిస్తున్నది కేవలం డబ్బేనా..? పేదరికాన్ని వదిలించుకోవాలనే కసిని రేకెత్తేలా, అర్హులకు ఉపాధి అవకాశాలు చూపిస్తూ పేదవాడి ఆలోచనా విధానాన్ని ప్రేరేపించే పాలన ఇవ్వలేరా..? ఉద్యోగం రాలేదన్న నైరాశ్యంలో ఉన్నవాడికి, నైపుణ్యాల లోపాలను గుర్తించి, వాటిని పెంచుకుని విజయం సాధించే దిశగా నడిపించే స్ఫూర్తిమంతమైన పాలన ఇవ్వలేరా..? ఒక వ్యక్తి తనలోని శక్తిని తానే గుర్తించి, దాన్ని బయటపెట్టేందుకు, దాన్నే బతుకుబాటుగా మార్చుకునేందుకు కావాల్సిన వాతావరణాన్ని సృష్టించే పాలన ఇవ్వలేరా..? మనుషుల్లో ఓటర్లను చూసే నాయకులు ఉన్నంతకాలం.. పాలన అంటే వారు విదిల్చే సాయమనో, వారి ఉదారతకు నిదర్శనమో అన్నట్టుగా చెప్పుకోవాల్సి వస్తోంది.