ప్రతిపక్ష నేత జగన్ ప్రారంభించిన ప్రజాసంకల్ప పాదయాత్ర నేడు పశ్చిమ గోదావరి జిల్లా మాడేపల్లికి చేరుకుంటుంది. ఈరోజుతో 2000 కిలోమీటర్ల దూరం జగన్ నడిచినట్టు అవుతుంది. జిల్లాలో ఏర్పాటవుతున్న భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొనబోతున్నారు. జగన్ ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటూ వస్తున్నారనీ, కానీ ఈ మైలురాయి చేరేసరికి జగన్ కు అవకాశం ఇచ్చి తీరాలని ప్రజలు తీర్మానించుకున్నారంటూ ఆ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సీమాంధ్ర జిల్లాలో జగన్ పాదయాత్రకు అనూహ్యమైన మద్దతు లభిస్తోందనీ, జనం భారీ ఎత్తున తరలివస్తూ ఉండటం పట్ల పార్టీ వర్గాలు ఉత్సాహంగా ఉన్నాయని నేతలు అంటున్నారు. అయితే, ఈ సందర్భంగా అంతా బాగుందని వైకాపా వర్గాలు, అభిమానులు చెప్పుకోవచ్చు. కానీ, మార్చుకోవాల్సినవి ఏంటో విశ్లేషించుకుంటేనే ఈ సందర్భం అసలైన మైలురాయి అవుతుంది.
పాదయాత్ర మొదలైన కొత్తలో వరుసగా హామీల మీదే జగన్ ఫోకస్ చేశారు. నవరత్నాల గురించి గొప్పగా చెప్పారు. అయితే, పాదయాత్ర 2000 కి.మీ. మైలురాయికి వచ్చేసరికి నవరత్నాల గురించి ప్రస్థావన తగ్గిపోయింది. ఇదే పార్టీ మేనిఫెస్టో అని గతంలో ప్రకటించారు. కానీ, రానురానూ నవరత్నాల ప్రాధాన్యతను జగనే తగ్గించేశారు. వాటి స్థానంలో స్థానికంగా ఉండే సమస్యలపై హామీలు ఇస్తూ వస్తున్నారు. అయితే, ఈ హామీలన్నీ ఆచరణ సాధ్యమా.. అనేది ప్రశ్న? ఉదాహరణకు.. పావలా వడ్డీకే ఇళ్ల నిర్మాణానికి రుణాలు ఇచ్చేస్తామని జగన్ తాజాగా హామీ ఇచ్చారు. ఇది రాష్ట్ర ప్రభుత్వంపై పెనుభారమయ్యే అవకాశం ఉంటుంది. ఇతర హామీల విషయంలోనూ వాటి బడ్జెట్ ఏంటనే ప్రశ్న ప్రశ్నగానే ఉంది. హామీలు ఇచ్చినంత మాత్రాన నమ్మే పరిస్థితుల్లో ప్రజలందరూ లేరు. ఎన్నికల ముందు నాయకులు ఇచ్చే హామీలకు అతీగతీ ఉండదనే ఒక స్థాయి నమ్మకం ప్రజల్లో ఏర్పడిపోయింది. వాటి అమలుపై సాధ్యాసాధ్యాలు కూడా వివరిస్తేనే అర్థం చేసుకుంటారు.
రాష్ట్రంలో కీలకంగా మారిన ప్రత్యేక హోదా పోరాటంపై కూడా వైకాపా స్పష్టత ఇవ్వలేకపోతోంది. తాము అధికారంలోకి వస్తే తెచ్చేస్తామని జగన్ చెబుతున్నారు. నాలుగేళ్లుగా పోరాటం సాగిస్తున్నామని చెబుతున్నారే తప్ప… అది కేంద్రంలోని భాజపాపై సాగిస్తున్న పోరాటం అనేట్టుగా ఎక్కడా కనిపించడం లేదు. పాదయాత్రలో పదేపదే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారుగానీ… భాజపాపై తీరుపై మండిపడ్డది లేదు. కేంద్రం ఇవ్వాల్సిన హోదా విషయంలో రాష్ట్రంలోని ముఖ్యమంత్రిపై మాత్రమే పోరాటం అన్నట్టుగా సాగుతోంది. ఇంకో ముఖ్యమైన అంశం… పాదయాత్రలో జగన్ ఎక్కువగా ఆధారపడుతున్నది చంద్రబాబుపై విమర్శలపైనే. ఈ క్రమంలో వైకాపా నాలుగేళ్లుగా పోషించిన క్రియాశీల ప్రతిపక్ష పాత్ర గురించి జగన్ మాట్లాడటం లేదు.
జగన్ పాదయాత్ర సందర్భంగా పెద్ద ఎత్తున జనం వస్తుండటాన్ని విజయంగా పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారంటే దానికి ప్రధాన కారణం.. పార్టీ నేతల ఏర్పాట్లు అనొచ్చు. ఒక ప్రాంతానికి జగన్ యాత్ర వస్తోందని నిర్ణయించగానే… అక్కడికి కొన్ని వాహనాల్లో వైకాపా నేతలూ కార్యకర్తలు ముందుగానే వస్తున్నారు. యాత్రలో వారూ మమేకం అవుతున్నారు. ఇక, స్థానికంగా ఉండేవారు కూడా జగన్ ను ఓసారి చూడాలని సహజంగానే ఉత్సుకత చూపుతారు. వచ్చినవాళ్లంతా ఓటేసేవారేనా అనేదే ప్రశ్న..?
ఇంకోటీ… పార్టీపరంగా ద్వితీయ శ్రేణి నాయకులంతా జగన్ యాత్రవైపు మాత్రమే చూస్తున్నారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో వారివారి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడంపై పెద్దగా దృష్టి పెడుతున్నారా లేదా అనేది మరో ప్రశ్న..? పార్టీలో జగన్ తరువాత అత్యంత క్రియాశీలంగా స్వతంత్రంగా వ్యవహరించేంత స్వేచ్ఛ ఇతరులకు ఉండదనే అభిప్రాయముంది. దీని వల్లే బాధ్యతల వికేంద్రీకరణ జరగడం లేదనే విశ్లేషణా ఉంది. ఇలా.. జగన్ మార్చుకోవాల్సినవీ… సంస్థాగతంగా పార్టీలో మారాల్సినవీ కొన్ని ఉన్నాయి. లోపాలను విశ్లేషించుకుని సవరించుకుంటేనే ఈ సందర్భం నిజమైన మైలురాయి అవుతుంది. లేదంటే, జస్ట్ 2000 కి.మీ. రాయిగానే మిగిలిపోతుంది!