ఆంధ్రా రాజకీయాల్లో వేలు పెడతాం అంటూ వరుసగా ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మరో నేత కేటీఆర్. ఎలా వేలు పెట్టబోతున్నారనే అంశమ్మీదే రకరకాల ఊహాగానాలూ విశ్లేషణలు వస్తున్నాయి. అయితే, నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి తెరాసకి ఉండదు. పరోక్షంగా ఏదో ఒక పార్టీకి మద్దతు ఇచ్చి, ఆ పార్టీకి అనుకూలంగా ప్రచారం కోసం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పనిచేసే క్రమంలో తెరాస కొంత క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంది అనిపిస్తోంది. అయితే, తెరాస మద్దతు ఇచ్చేది జనసేన పార్టీకా..? లేదంటే, జగన్ పార్టీకా..? నిజానికి, ఈ అంశంలో కూడా పెద్దగా సందిగ్ధం లేదు. ఎలా అంటే, తెరాసకు మిత్రుడైన ఎమ్.ఐ.ఎమ్. ఇప్పటికే ఒక ప్రకటన చేసేసింది. ఆంధ్రాలో జగన్ కి మద్దతు ఇస్తామని తేల్చి చెప్పేసింది. జగన్ కి అసదుద్దీన్ మద్దతు ప్రకటించాక, పవన్ కల్యాణ్ కు మద్దతు ఇచ్చే పని తెరాస చెయ్యలేదు కదా!
ఇక, ఏపీ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితి చూస్తే… టీడీపీకి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షమంటే అక్కడ వైకాపానే. జనసేనను మూడో ఆప్షన్ గానే ఎక్కువమంది చూస్తున్న పరిస్థితి. తాజాగా, కాపు ఉద్యమ నేత ముద్రగద పద్మనాభం కూడా జగన్ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అయితే, కాపు రిజర్వేషన్ల అంశమై ఇప్పటికే జగన్ ఒక ప్రతికూల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనతో ఇదే అంశమై మరోసారి సానుకూల ప్రకటన చేయించి, ఆ తరువాత చంద్రబాబుకి వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా జగన్ కి మద్దతు ప్రకటించాలనే ప్రయత్నం ఏదో జరుగుతున్నట్టుగా కూడా కొన్ని కథనాలున్నాయి. అంటే, ఎన్నికలు వచ్చే సరికి ఆంధ్రాలో టీడీపీని ఎదుర్కొనే ప్రధాన ప్రతిపక్షం వైకాపాగా మాత్రమే అందరికీ ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఇలాంటి సందర్భంలో, చంద్రబాబును ఎదుర్కోవడమే తెరాస లక్ష్యం కాబట్టి… టీడీపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒక తాటి మీదికి తీసుకొచ్చే పెద్దన్న పాత్రను కేసీఆర్ పోషించే అవకాశాలున్నాయనేది కొందరి అభిప్రాయం. అంటే, ఏపీలో కూటమి అనుకోవచ్చు. పవన్ కల్యాణ్, జగన్ లతో ఆయనకి మంచి సంబంధాలే ఉన్నాయి. వాస్తవానికి ఈ ఇద్దరూ ఒకే ఒరలో ఇమడని వారే అయినా… చంద్రబాబును ఓడించాలనే ఉమ్మడి లక్ష్యంతో ఇద్దర్నీ ఒక చోటికి చేర్చే పాత్ర తెరాస తీసుకునే అవకాశం ఉంటుంది. అంతకుమించి ప్రత్యేకంగా తెరాస ‘పెట్టబోయే వేలు’ అంటూ వేరేది ఉన్నట్టుగా కూడా కనిపించడం లేదు. ఏపీలో కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలా వద్దనే చర్చ టీడీపీలో ఎలాగూ ఉంది. ఇక, భాజపాకి ఒంటరి పోరు తప్పదు. ఆ పార్టీతో ఎవ్వరూ కలిసే ప్రసక్తే లేదు. అలాంటప్పుడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును వైకాపా, జనసేనలు చీల్చుకుంటే అది టీడీపీకి ప్లస్ అయ్యే పరిస్థితి అవుతుంది. అలా చీలకుండా కట్టడి చేయగలిగితే టీడీపీకి కొంత ఇబ్బంది తప్పదు. అలా జరగాలంటే.. వైకాపా, జనసేన మధ్య రాయబారం నడిపే అవకాశం కేసీఆర్ కి మాత్రమే ఉంది. మరి, ఏపీలో టీడీపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేయడమేనా తెరాస పెట్టబోతున్న వేలు అనేది త్వరలోనే స్పష్టత వచ్చేస్తుంది.