విపక్ష నేత జగన్ ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జిల్లాలో నడిచేసరికి… ఆయనకి స్వర్గీయ నందమూరి తారక రామారావు హఠాత్తుగా గుర్తొచ్చారు! తెలుగువారికి ఆయన చేసిన సేవలను మరింత హఠాత్తుగా నెమరు వేసుకున్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవల గురించి జగన్ మాట్లాడటం విశేషం..! అంతేకాదు, ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవల్ని గుర్తు చేసుకుంటూ… కృష్ణా జిల్లా వాసులకు ఇతోథికంగా ఒక హామీ కూడా ఇవ్వడం మహాద్భుతం!
జగన్ తాజాగా ఒక ట్వీట్ చేశారు. నందమూరి తారక రామారావు తన జీవితాన్ని తెలుగువారి కోసం, అణగారిన వర్గాల కోసం అంకితం చేశారన్నారు. తన పాదయాత్ర సందర్భంగా, ఆయన సొంత గడ్డ నిమ్మూకూరులో ఒక ప్రతిజ్ఞ చేస్తున్నానని… కృష్ణా జిల్లాను నందమూరి తారక రామారావు జిల్లాగా మారుస్తాననీ ట్వీటిచ్చారు! అవునండీ కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లా చేస్తారట! అవునండీ.. ఈ మాట చెప్పింది జగనే!
కృష్ణా జిల్లాలో ఎమోషనల్ రాజకీయాలు చేయాలనే ఉద్దేశమే తప్ప, ఎన్టీఆర్ అంటే జగన్ లో సహజంగా పుట్టుకొచ్చిన అభిమానం ఇది కాదనేది సగటు తెలుగువాడికి తెలియంది కాదు! ఒకవేళ, ఎన్టీఆర్ పై అంత గౌరవమే ఉంటే… తన తండ్రి వైయస్ హయాంలో శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరును వైయస్ తొలగిస్తుంటే, జగన్ అడ్డుపడలేకపోయారా..? తెలుగువారి కోసమూ, అణగారిన వర్గాల ప్రజల కోసం పాటు పడిన ఎన్టీఆర్ పేరు మార్చొద్దని ఆనాడు వైయస్ కి చెప్పలేకపోయారా..? అప్పుడు గుర్తుకు రాలేదా ఎన్టీఆర్ ఘనత..! ఒకటనేంటి, కనిపించిన ప్రతీ పథకానికీ రాజీవ్, ఇందిరమ్మ అని పేర్లు అని వైయస్ పేర్లు పెడుతుంటే… తండ్రిగారికి ఒక్కసారైనా సలహా ఇవ్వలేకపోయారా..? ఏదో ఒక దానికి ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టించలేకపోయారు..?
ఫక్తు రాజకీయం కోసం కాకపోతే, ఈ ప్రకటన వెనక ఎలాంటి అభిమానాలు లేవనేది తెలుగు ప్రజలకు తెలుసు. ఎన్టీఆర్ పేరు పెడతా అని ప్రకటించినంత మాత్రాన.. ఎమోషనల్ అయిపోయి, తనను అభిమానించేవారు పెరిగిపోతారని జగన్ కలలు కంటున్నట్టున్నారు! తెల్లారి లేచి మొదలు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ దుమ్మెత్తి పోస్తూ… ఇప్పుడా పార్టీ వ్యవస్థాపకుడిపై వల్లమాలిన ప్రేమ కురిపించేస్తే… దీన్ని నిజమని వైకాపా వర్గాల్లోనే నమ్మేవారు ఉండరు. ‘ఎన్టీఆర్ పై సహజమైన గౌరవంతోనే జగన్ చేసిన ప్రకటనగా దీన్ని చూస్తున్నారా’ అంటూ ఆ పార్టీ వర్గాల్లో సర్వే పెట్టమనండీ! ఎంతమంది నమ్ముతున్నారో కనీసం ఆ పార్టీ పెద్దలకైనా తెలుస్తుంది..!