షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చీల్చే ఓట్లు తనకు ఎప్పటికైనా మైనస్సే అనుకుంటున్న జగన్ ముందుగా ఆమెను రాజకీయంగా బలహీనం చేసే ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ లో ఇప్పటికీ మిగిలి ఉన్న కీలక నేతలకు ఆఫర్లు ఇచ్చి మరీ పార్టీలో చేర్చుకుంటున్నారు. శైలజానాథ్ కు శింగనమల టిక్కెట్ హామీ ఇచ్చి..ఆర్థికంగా కూడా అండగా ఉంటామని భరోసా ఇచ్చి మరీ పార్టీలోకి ఆహ్వానించారని అనంతపురం వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
చాలా మంది కాంగ్రెస్ నేతలు వైసీపీలోకి వస్తారని ఆ తర్వాత శైలజానాథ్ ప్రకటించారు. ఆ చాలా మంది ఎవరో కానీ.. షర్మిల పై కొంత మంది నేతలు అసంతృప్తిగా ఉన్నారు. వారితో ప్రస్తుతానికి చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు. ఎన్నికలుక ముందు వైసీపీ నుంచి చాలా మంది దళిత నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే కాంగ్రెస్ ను అంటి పెట్టుకుని ఉన్న కొంత మంది సీనియర్లను కూడా సంప్రదిస్తున్నట్లుగా చెబుతున్నారు.
షర్మిలను రాజకీయంగా టార్గెట్ చేయకపోతే ఆమె ముందు ముందు బలం పుంజుకునే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లలేకపోవడం.. షర్మిల మాత్రం త్వరగా ప్రజల్లో కలిసిపోతూండటంతో వైసీపీ క్యాడర్ కు సమస్యగానే ఉంది. అయితే శైలజానాథ్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి కనీస ప్రభావం చూపించలేకపోయారు. మరి ఆయనను చూసి ఎంత మంది వైసీపీలోకి వస్తారో వేచి చూడాల్సి ఉంది.