ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్ప పాదయాత్ర 200 రోజులకు చేరుకుంటోంది. అమలాపురం సమీపంలో ఈ మైలురాయిని దాటబోతున్నారు. దీంతో వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా కోటి హృదయాల్లో ఒకే ఒక్కడు అంటూ సాక్షి కూడా ప్రత్యేక కథనాలు ప్రచురించింది. జననేత వెంట జన ప్రవాహం సాగుతోందనీ, జగన్ రాకతోనే ఊరూరా పోరాటాలు మొదలయ్యాయనీ, దివంగత వైయస్సార్ ఆశయాలను పుణికిపుచ్చుకున్న జగన్ వెంట ప్రజలు నడుస్తున్నారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. పాదయాత్ర 200 రోజులకు చేరుకోవడం వైకాపా శ్రేణులకు ఉత్సాహాన్నిచ్చే అంశమే. అయితే, ఈ సమయంలో పాదయాత్ర ద్వారా ఇంతవరకూ సాధించింది ఏంటనేది విశ్లేషించుకోవాల్సిన అవసరం వైకాపాకి ఉంది.
అనుకున్న లక్ష్యాలను వైకాపా సాధిస్తోందా…? ఎన్నికల దిశగా ఏ మేరకు సంసిద్ధంగా ఉన్నట్టు..? పాదయాత్ర ద్వారా ఆకర్షితమౌతున్న జనాలను పోలింగ్ బూత్ వరకూ ఉత్సాహం రప్పించే వ్యూహంతో పార్టీ ఉందా..? ఇలాంటి ఎన్నో అంశాలు పార్టీలో చర్చకు రావాలి. కానీ, ఆ పరిస్థితి కనిపించడం లేదు. జగన్ యాత్ర కేవలం వన్ మేన్ షో మాదిరిగా మాత్రమే నడుస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు ఆయన్ని అనుసరిస్తూ టీడీపీపై విమర్శలకే పరిమితం అవుతూ ఉన్నారే తప్ప, జగన్ తెస్తున్న ఊపు జనంలో కొనసాగించే వ్యూహా రచన చేస్తున్నట్టు కనిపించడం లేదు. జగన్ యాత్ర వస్తున్న చోటికి జన సమీకరణ చేయడానికి మాత్రమే పరిమితం అవుతున్నారే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లోనే ఉంది.
ప్రత్యేక హోదా సాధన కోసం త్యాగాలు అంటూ ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేశారు కదా! పాదయాత్రలో భాగంగా జగన్ వారి గురించి ఒక రోజు గొప్పగా మాట్లాడి ఊరుకున్నారు. వారిని కూడా యాత్రలో భాగస్వామ్యం చేసి ఉంటే.. చేసిన రాజీనామాలు ప్రభావవంతంగా పార్టీకి ఉపయోగపడేవి. ఇదొక్కటే కాదు… ఏపీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండించడమూ లేదు. దీన్ని కేవలం సీఎం చంద్రబాబు ప్రయత్న లోపంగా మాత్రమే యాత్రలో జగన్ ప్రచారం చేస్తున్నారు. సరే, అది వైకాపా పొలిటికల్ అజెండా అనే విషయం ప్రజలకు తెలిసిందే. ఇదే క్రమంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాడుతున్న క్రమాన్ని జగన్ వదిలేస్తున్నారు. వైకాపా అధికారంలోకి రావడమే సమస్యలన్నింటికీ పరిష్కారం అంటున్నారే తప్ప… ఈలోగా తామేం చేస్తున్నారో, చేశారో కూడా పాదయాత్రలో జగన్ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.
అన్నిటికన్నా ముఖ్యమైన మరో అంశం… ప్రతిపక్షంగా వైకాపా సాధించింది ఏంటి..? పాదయాత్ర మొదలైన దగ్గర నుంచీ కేవలం టీడీపీపై విమర్శలు చేయడానికే జగన్ పరిమితమౌతూ వస్తున్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలన అవినీతిమయం అంటున్నారు. అన్నీ వైఫల్యాలే అంటున్నారు. ఈ క్రమంలో నాలుగేళ్లుగా ప్రతిపక్ష పార్టీగా పోషించిన క్రియాశీల పాత్ర ఏంటనేది కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. టీడీపీకి వైకాపా మాత్రమే ఎందుకు ప్రత్యామ్నాయం అనేది స్పష్టత ఇవ్వాలి. టీడీపీ పాలన బాగులేదు కాబట్టి ఛాన్స్ ఇవ్వండీ అంటే.. అది ఆప్షన్ అవుతుంది. ప్రతిపక్ష నేతగా జగన్ ఫలానాది సాధించారు కాబట్టి, అధికారం ఇస్తే మరింత సాధిస్తారని చెప్పుకుంటే అది ప్రత్యామ్నాయం అవుతుంది. ఈ తేడాను ప్రజలకు జగన్ వివరించాల్సి ఉంది. 200 రోజులకు పాదయాత్ర చేరిన సందర్భంగా ఇలాంటి ఇలాంటి అస్పష్టతలు వైకాపాలో చాలా ఉన్నాయి. వీటిని విశ్లేషించుకుంటే… యాత్ర పూర్తయ్యేలోపు పార్టీకి ఉపయోగకరమైన ఒక వాతావరణం రావడానికి దోహదమౌతుంది.