ప్రత్యేక హోదా ఇస్తానని తిరుపతిలో ప్రధాని మోడీ చెప్పారనీ, కానీ ఈరోజున ఆ మాట ఆయన నోట రాలేదని ప్రతిపక్ష నేత జగన్ అన్నారు. ఎన్నికల్లో వారిచ్చిన హామీలు ప్రధానికి గుర్తుకురాలేదన్నారు. హోదాకి బదులుగా ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు నాయుడు ఆమోదంతోనే ఇచ్చామని ప్రధాని చెప్పడం మరింత బాధాకరమైన అంశమన్నారు. హోదాకి బదులు ప్యాకేజీ చాలు అని చెప్పడానికి చంద్రబాబు ఎవరు అని జగన్ ప్రశ్నించారు. ఆ హక్కు ఆయనకి ఎవరిచ్చారన్నారు. హోదా వస్తేనే ఏపీకి మేలు జరుగుతుందని తెలిసీ, అది ఉంటేనే పరిశ్రమలు వస్తాయనీ తెలిసీ, యువతకు ఉద్యోగాలు వస్తాయని తెలిసి కూడా రాజీపడటానికి ఆయన ఎవరన్నారు. రాహుల్ గాంధీ మాటల్లో అర నిమిషం కూడా ఆంధ్రా ప్రస్థావన లేదన్నారు.
చంద్రబాబు ప్రవర్తించిన తీరు మరింత బాధ కలిస్తోందన్నారు. గల్లా జయదేవ్ మాట్లాడిన మాటలు… గత నాలుగేళ్లుగా మేం చెప్పిన మాటలా కాదా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. అసెంబ్లీ రికార్డులు తిరిగేస్తే ప్రత్యేక హోదా గురించి తాము ఇవే మాటలు మాట్లాడిన సందర్భాలు ఎన్నో కనిపిస్తాయన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ మేం చేసిన ధర్నాలు, దీక్షలు, ఇలా ఏ విషయం చూసుకున్నా… గత నాలుగున్నరేళ్లుగా తాము చెబుతున్న అంశాలు ఇవే అన్నారు. అయితే, ఆరోజున తమ మాటల్ని వెక్కిరించారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందే హోదా అమలు చేయాలంటూ ప్రణాళికా సంఘం కేంద్రాన్ని ఆదేశించిందన్నారు. ఆయన సీఎం అయ్యాక కూడా ప్లానింగ్ కమిషన్ కొన్నాళ్లు అమల్లో ఉందనీ, ఏడునెలలపాటు ఆ విషయాన్ని చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదన్నారు.అరుణ్ జైట్లీ ప్యాకేజీ ప్రకటిస్తున్న సమయంలో టీడీపీ కేంద్రమంత్రులు పక్కనే ఉన్నారనీ, చంద్రబాబు ఆమోదంతోనే ప్యాకేజీ వస్తోందని చెప్పారన్నారు. ఆ తరువాత ప్యాకేజీ గొప్పదంటూ ఊదరగొట్టారన్నారు.
చంద్రబాబు ఏమీ చెయ్యరు కాబట్టి, జరుగుతున్న అన్యాయాన్ని దేశవ్యాప్తంగా తెలియజేయాలన్న ఉద్దేశంతోనే వైకాపా ఎంపీలు రాజీనామాలు చేశారన్నారు. అదే రోజున టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించి ఉంటే కేంద్రం దిగి వచ్చి, హోదా ఇచ్చి ఉండేది కాదా అని అభిప్రాయపడ్డారు. రాజీనామాలు చేస్తే హోదా వస్తుందని తెలిసీ తన ఎంపీలతో చంద్రబాబు రాజీనామాలు చేయించకపోవడం ధర్మమా అని జగన్ నిలదీశారు. ప్రస్తుతం చంద్రబాబు నిజంగానే భాజపాతో యుద్ధంతో చేస్తున్నారా అనే అనుమానం ప్రజలకు కలిగే విధంగా ఆయన తీరు ఉంటోందన్నారు. టీటీడీ బోర్డు మెంబర్ గా భాజపా నేత భార్యను నియమించారు, ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తీస్తుంటే సెట్ లో వెంకయ్య నాయుడు కనిపిస్తారన్నారు, పరకాల ప్రభాకర్ చంద్రబాబు కొలువులో ఉంటారని ఎద్దేవా చేశారు!
ఇప్పుడు టీడీపీ ఎంపీలు రాజీనామాలు చెయ్యాలనీ, వైకాపా మాజీ ఎంపీలతో కలిసి నిరాహార దీక్షకు కూర్చుందామన్నారు. కేంద్రం దిగిరాదేమో చూద్దామన్నారు. యుద్ధమంటే ఇలా చేస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమౌతుందన్నారు. కానీ, చంద్రబాబు ఇది చెయ్యరన్నారు. చంద్రబాబుపై ఒత్తిడి వచ్చే విధంగా, ఎంపీలతో రాజీనామాలు చేయించే విధంగా మంగళవారం రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చారు జగన్. ఈ బంద్ ద్వారా ఆంధ్రా ప్రజల నిరసన కేంద్రానికి అర్థం కావాలన్నారు. ఎవర్నీ నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని జగన్ కోరారు. కాంగ్రెస్ మోసం చేసిందనీ, భాజపా అధికారంలో ఉండీ మోసం చేసిందన్నారు. ప్రత్యేక హోదా పదేళ్లు కాదు, పదిహేనేళ్లు తెస్తామని చంద్రబాబు అన్నారు. ఆ తరువాత, దాన్ని ఏరకంగా తూట్లు పొడిచారో చూశాం.. కాబట్టి, ఈయన్నీ నమ్మొద్దన్నారు.