వ్యవస్థలన్నీ మారిపోవాలనీ, పరిపాలనలో విశ్వసనీయత రావాలంటుంటారు విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఆయన పాదయాత్ర సాగుతోంది. ఈ సందర్బంగా ఆయన ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. ఉద్యోగ విప్లవం తీసుకొస్తానని హమీ ఇస్తున్నారు. వ్యవస్థల్ని సంస్కరించి రాష్ట్రంలో ఉద్యోగ విప్లవం తీసుకొస్తామన్నారు! దాదాపు రెండు లక్షల ఖాళీలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు, ప్రతీ గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి, ప్రతీ 50 ఇళ్లకూ ఒక వాలంటీర్ ను నియమిస్తామన్నారు. వీళ్లకి నెలకి రూ. 5 వేలు గౌరవవేతనం ఇస్తామన్నారు. ఉద్యోగాలు వచ్చే వరకూ అదే గ్రామంలో ఉంటూ సేవ చేసుకునే అవకాశం యువతకి ఉంటుందన్నారు.
ప్రభుత్వ పథకాలు ప్రతీ ఇంటికీ సక్రమంగా అందుతున్నాయా లేదా అనేది చూడటం వీరి బాధ్యత అని చెప్పారు. టెన్త్, ఇంటర్ పరీక్షలకు ప్రతీయేటా తేదీని ముందుగా ప్రకటించినట్టే… ఉద్యోగాల నోటిఫికేషన్లకు కూడా ఒక తేదీని ప్రకటిస్తామన్నారు. ఇంకోటి… పరిశ్రమల్లో స్థానిక యువతకే ఉద్యోగాలు వచ్చేలా ఒక చట్టం కూడా తీసుకొస్తామన్నారు. ప్రత్యేక హోదా వస్తే పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయనీ, తద్వారా యువతకు ఉపాధి వస్తుందన్నారు. ప్రత్యేక హోదా కోసం మనం చిత్తశుద్ధితో పోరాటం చేద్దామన్నారు.
ఉద్యోగ విప్లవం తెస్తా అని చెప్పడం వరకూ బాగానే ఉంది. కానీ, దాన్ని ఎలా తెస్తారనే స్పష్టతే జగన్ మాటల్లో ఉండటం లేదు. గ్రామాల్లో ప్రతీ 50 ఇళ్లకీ ఒక్కో వాలంటీర్లు నియమించి, ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేస్తా అంటున్నారు! మరి, ఇప్పటికే గ్రామాల్లో ఉన్న గ్రామ కార్యదర్శుల పనేంటి..? ఇంటింటికీ వెళ్లాల్సిన బాధ్యత, పథకాల అమలు పర్యవేక్షణ… ఇలాంటివన్నీ వారి విధులు కదా! ఇంకోటి… ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు, కరెక్టే! కానీ, ఆ హోదా సాధనకు వైకాపా ఏం చేస్తుందనేది చెప్పలేకపోతున్నారు. ‘మనందరం కలిసి పోరాడదాం’ అని ఇప్పుడు అంటున్నారు. ఆ పోరాటం ఎప్పుడు… ఎలా.. ఎవరిపైన..? గడచిన నాలుగేళ్లూ చేసిన పోరాటం మాటేంటి…? ఎంపీలు రాజీనామాలు చేయడమే తాము చేసి గొప్ప పోరాటం అని ఓపక్క చెబుతూనే… అందరం కలిసి మళ్లీ పోరాడాలని జగన్ అంటున్నారంటే… హోదా దిశగా వైకాపా పోరాటంలో వైఫల్యాన్ని ఒప్పుకుంటున్నట్టే కదా. ఉద్యోగ విప్లవం వస్తే మంచిదే.. కానీ, దానికి ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తే సరిపోదు. పరిశ్రమలు రావాలి. యువతలో నైపుణ్యాలను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. అన్నింటిక మించి.. ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించే స్థాయి ఉన్న నాయకత్వం రాష్ట్రంలో ఉండాలి. అప్పుడు ఉద్యోగాలైనా విప్లవాలైనా!