ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర మొదలుపెట్టి ఆరు రోజులైంది. ఆరోరోజు కడప జిల్లాలో ఈ యాత్ర సాగింది. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులోనూ, తరువాత దువ్వూరులోనూ జగన్ మాట్లాడారు. ‘మన ప్రభుత్వం వస్తే.. మనందరం కోరుకుంటున్న ప్రభుత్వం వస్తే’… అంటూనే, తమ పాలన ఎలా ఉండబోతోందో అనేది చెప్పారు. పాదయాత్ర మొదలైన గత కొద్దిరోజుల నుంచి ఏయే అంశాలైతే చెప్పారో, ఎలాంటి హామీలైతే ఇచ్చారో.. వాటినే రిపీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై రొటీన్ గా విమర్శలు చేశారు. ఏ ఒక్క రైతుకూ న్యాయం జరగలేదన్నారు. వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడేసి పంటలు పడేవనీ, చంద్రబాబు హాయంలో అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. ఇక, ప్రొద్దుటూరు సభలో మరో కొత్త హామీ ఇచ్చారు. సభకు ముందుగానే తనను కొంతమంది ఆటో డ్రైవర్లు కలుసుకుని సమస్యలు చెప్పారన్నారు. వారందరికీ తాను హామీ ఇస్తున్నాననీ, మన ప్రభుత్వం వచ్చాక అందరి ఆటోల్లోనూ నాన్న వైయస్సార్ తోపాటు తన ఫొటోను కూడా పెట్టుకునేంతగా కార్యక్రమాలు చేసి చూపించే ఆలోచన చేస్తానన్నారు.
పిల్లల్ని స్కూళ్లకు పంపిస్తే చాలు.. ఏడాదికి రూ. 15 వేలు ఇస్తారట! పేద విద్యార్థులు పెద్ద చదువులకు వెళ్తే చాలు.. మొత్తం ఫీజు కట్టేసి, ఏడాది పొడవునా చేతి ఖర్చులకు కావాల్సి సొమ్ము కూడా ఇస్తారట! వృద్ధాప్య పింఛెను రూ. 2 వేలకు పెంచేస్తారట, అది కూడా 45 ఏళ్ల నుంచే పెన్షన్ ఇచ్చేస్తారట! పనిలేకపోయినా సరే… నెలకు రూ. 2 వేలు వస్తాయన్న భరోసా పేద ప్రజలకు కల్పించడమే తన ధ్యేయం అన్నట్టుగా జగన్ చెప్పారు. దీంతోపాటూ వైకాపా మేనిఫెస్టో ఎలా ఉంటుందో అనేది కూడా మరోసారి చెప్పారు. నిజానికి, తాను పాదయాత్ర చేస్తున్నదే వైకాపా మేనిఫెస్టో రూపకల్పనకు అన్నట్టుగా మొదట్నుంచీ చెబుతున్నారు. ఎన్నికలు వచ్చే నాటికి ప్రజలు తయారు చేసిన మేనిఫెస్టోతో సిద్ధమౌతాననీ, అది కూడా రెండూ లేదా మూడు పేజీలు మాత్రమే ఉంటుందని జగన్ పదేపదే చెబుతున్నారు.
అయితే, చేతికి ఎముక లేదన్నట్టుగా జగన్ హామీలు ఇచ్చుకుంటూనే వెళ్లిపోతున్నారు కదా! మన ప్రభుత్వం వస్తే వస్తే అంటూ పదేపదే వరాలు వరద ఉంటుందని చెబుతున్నారు కదా! మరి, ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టాలి కదా! ఆరు రోజులకే ఈ వరాల జాబితా కొండవీటి చాంతాడంత అయిపోయింది. ఇక, ఆరు నెలలు దాటేసరికి ఇంకెన్ని ఉంటాయో మరి. ఆ లెక్కన ఇప్పుడు జగన్ చెబుతున్న రెండూ లేదా మూడు పేజీల మేనిఫెస్టో సరిపోతుందా..? నవరత్నాలు, దశలవారీ మద్య నిషేధం, పెన్షన్లు వంటి స్టాండర్డ్ హామీలు కొన్ని ఉన్నాయి. కానీ, వాటికి అదనంగా రోజుకో కొత్త హామీ వచ్చి చేరుతోంది. ఆరో రోజు ఆటో డ్రైవర్లకు కొత్త హామీ ఇచ్చారు. అంతకుముందు, ప్రభుత్వోద్యోగులకు ఇళ్లు, ఇంటి స్థలాలు ఇచ్చేస్తామన్నారు. ఆసుపత్రిలో చేరిన పేదవాడికి చికిత్సతోపాటు విశ్రాంతి తీసుకున్న సమయంలో కూడా డబ్బు ఇచ్చేస్తామన్నారు. ఇలా.. ఈ జాబితా ఇంకా పెద్దది అవుతూనే ఉంటుంది! రెండు లేదా మూడు పేజీలు సరిపోతాయా..?