ఎన్నికల ముందు నాయకులు హామీలు ఇవ్వడం సహజం. అయితే, అధికారంలోకి రాగానే వాటన్నింటినీ అమలు చేస్తారా లేదా అనేది వేరే చర్చ. కానీ, ఇస్తున్న హామీలు, ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలు చూపించేవిగా ఉంటున్నాయా..? వాటిలో కేవలం ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోణం మాత్రమే ఉంటోందా అంటే.. రెండో సందర్భమే ఎక్కువ. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష జగన్ ఇస్తున్న హామీలను ఒక్కసారి చూస్తే… చాలా వాటిలో డబ్బు పంపిణీ మాత్రమే కనిపిస్తుంది. నెలకి కొంత సొమ్ము ఇచ్చేస్తా అనే హామీలే ఎక్కువ.
తాజాగా తాడేపల్లి గూడెంలో జరిగిన పాదయాత్రలో కూడా కొన్ని వరాలు ఇచ్చారు. వాటిల్లో ఒకటి… దీర్ఘ కాల వ్యాధులతో బాధపడేవారికి నెలకి రూ. 10 వేలు పింఛెన్ ఇస్తానన్నారు. కొద్ది రోజులు వెనక్కి వెళ్తే, పట్టా పుచ్చుకుని, కొత్త న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న వారికి నెలకి రూ. 5 వేలు చొప్పున స్టైఫండ్ ఇస్తా అన్నారు. ఓ పదిరోజుల కిందట, కైకలూరు పాదయాత్రలో మాట్లాడుతూ.. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మే నెలలో ప్రతీ రైతు కుటుంబానికీ రూ. 12,500 ఇచ్చేస్తానంటూ హామీ ఇచ్చారు. అంతకు ఓవారం ముందు… పాదయాత్రలో భాగంగా కొంతమంది ఆటోడ్రైవర్లు కలిసి మాట్లాడారు. సొంత ఆటో కలిగి ఉన్న ప్రతీ డ్రైవర్ కూ రూ. 10 వేలు చొప్పున ప్రతీయేటా తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చేస్తామని వరమిచ్చారు. గుడివాడలో పాదయాత్ర సాగుతుండగా కొంతమంది నాయి బ్రాహ్మణులు జగన్ ను కలిసి, కష్టాలు చెప్పుకున్నారు. వారికీ ఓ వరం ఇచ్చేశారు. ప్రతీ షాపుకీ రూ. 10 వేలు ఇచ్చేస్తామన్నారు.
ఇలా పాదయాత్ర మొదలైన దగ్గర నుంచీ ఒక్కోటిగా తరచి చూసుకుంటే… జగన్ ఇచ్చిన హామీల్లో నెలవారీ డబ్బు పంపిణీ హామీలే ఎక్కువ. అయితే, వృద్ధాప్య పింఛెను, వికలాంగులకు నెలవారీ ఆర్థిక చేయూత వరకూ ఓకే. వాటిని ఎవ్వరూ తప్పుబట్టరు. కానీ, ఇతర సమస్యలు ఏవైనాసరే.. వాటి పేరుతో ఎవరు జగన్ ను పలకరించినా… నెలకి ఎంతో కొంత ఇచ్చేస్తా అంటూ హామీలు ఇచ్చేస్తున్నారు. అన్ని సమస్యలకూ నెలవారీ సొమ్ము ఇవ్వడం ఒక్కటే పరిష్కారం కాదు కదా! ఒక సమస్యను తన దృష్టికి కొంతమంది తీసుకుని రాగానే, దానిపై సమగ్ర అధ్యయనం చేస్తానని జగన్ అనడం లేదు. అలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. సమస్య మూలాల్ని తెలుసుకుని అక్కడి నుంచి పరిష్కారం చేస్తాననే మాట చెప్పడం లేదు. ఇక, ఈ నెలవారీ పంపిణీలు ఎంతవరకూ ఆచరణ సాధ్యం అనే ఆలోచన అస్సలు లేదు..! రాష్ట్ర బడ్జెట్ ఏంటీ, విభజన తరువాత రాష్ట్ర ఆదాయ వనరుల లభ్యత ఏంటీ.. ఇలా ఇచ్చుకుంటూ వెళ్తున్న హామీల అమలుకు నిధులు అదనంగా ఎక్కడి నుంచీ వస్తాయనే స్పష్టత లేనే లేదు. ఉదాహరణకు.. ఒక రోగంతో బాధపడేవారికి నెలవారీ మందుల ఖర్చులకు సొమ్ము ఇవ్వడం ఒక పద్ధతి అయితే… అదే సొమ్ములో కొంత భాగంతో సరైన సౌకర్యాలతో ఆసుపత్రి కట్టించి చికిత్సలు అందించడం, ఆ రోగాన్ని సమూలంగా అరికట్టే అధ్యయాలు చేయించడం మరో పద్ధతి. కానీ, జగన్ ఎక్కువగా ఆధారపడుతున్నది మొదటి తరహా పరిష్కారాలపైనే.