‘రావాలి జగన్… కావాలి జగన్’… నేటి నుంచి 168 నియోజక వర్గాల్లో ప్రతిపక్ష పార్టీ వైకాపా ప్రారంభిస్తున్న కార్యక్రమం ఇది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సాగుతున్న కొన్ని జిల్లాలు మినహా… రాష్ట్రమంతా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు వైకాపా శ్రేణులు సిద్ధమౌతున్నాయి. బూత్ స్థాయిలో దీన్ని నిర్వహిస్తారు. ప్రతీ ఇంటికీ వెళ్లి, వైకాపా అధికారంలోకి వస్తే కలిగే లాభాలను వివరిస్తారు. నవరత్నాల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు చెబుతారు. అవినీతి సొమ్ముతో పెద్ద ఎత్తున ఓటర్లను కొనేందుకు టీడీపీ సిద్ధమౌతున్న సమాచారం వైకాపా దగ్గర ఉందట, అందుకే ప్రజల్ని చైతన్యవంతం చేయడానికే ఈ కార్యక్రమమట!
సీఎం చంద్రబాబు నాయుడు ఓటుకి రూ. 3 వేలు ఇస్తారనీ, అదే వైకాపా అధికారంలోకి వస్తే జరిగే మేలు అంతకంటే భారీగా ఉంటుందని ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమ ఉద్దేశంగా వైకాపా శ్రేణులు చెబుతున్నాయి! జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఏడాదికి రూ. 1 లక్ష నుంచి 5 లక్షల వరకూ ప్రయోజనాలు చేకూరుతాయని ప్రచారం చేస్తారు. రైతు భరోసా కింద ఏడాదికి రూ. 12,500, ఉచిత కరెంట్, ఉచిత బోర్లు, ఫీజు రీఎంబర్స్ మెంట్, అమ్మ ఒడి, పెన్షన్లు… ఇలా ఎన్నో పథకాల ద్వారా వైకాపా అధికారంలో ఉండే ఐదేళ్లలో గరిష్టంగా రూ. 5 లక్షల ప్రయోజనాలు ప్రతీ ఒక్కరికీ దక్కుతాయన్న భరోసా ‘రావాలి జగన్… కావాలి జగన్’ కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరించబోతున్నారు.
అంటే… ఓటర్లకు ఇలా డబ్బుల లెక్కలు చెప్తారా..? ప్రజలు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కోసం మాత్రమే చూస్తారా..? ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ప్రజలకూ రాజకీయ పార్టీల మధ్య జరిగే ఆర్థిక లావా దేవీలా కనిపిస్తోందా..? ప్రజలను వైకాపా చూస్తున్న దృష్టి కోణం అచ్చంగా ఇదే అన్నట్టుగా ఉంది! మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ. లక్ష నుంచి ఐదు లక్షల ప్రయోజనం కలిస్తామని ప్రచారం చేయడాన్ని ఏమనుకోవాలి..? ప్రజా సంక్షేమం, భద్రత, రాష్ట్ర భవిష్యత్తు, వెనుబడిన ఆంధ్రా అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన, యువతకు అవకాశాలు.. ఇలాంటివే వైకాపాకి పట్టవన్నమాట! జగన్ ముఖ్యమంత్రి అయితే చాలు అనే ఒక్క లక్ష్యాన్ని మాత్రమే ప్రధానంగా చేసుకుంటున్నారు. అంతేగానీ, తమ భవిష్యత్తుకు జగన్ నాయకత్వం కావాలని ప్రజలు నిర్ణయించుకునేలా ఆలోచింపజేసే కార్యక్రమంగా ఇది కనిపించడం లేదు. చంద్రబాబు అయితే రూ. 3 వేలే ఇస్తారు, మేమైతే ఇదిగో లక్షలు ఇస్తామన్నట్టుగా ప్రజలకు చెప్పే ఈ కార్యక్రమాన్ని అచ్చంగా ‘ఓటర్లతో బేరం’ అనడంలో తప్పేముంది..?