ప్రతిపక్ష నేత జగన్మోన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర 3100 కి.మీ. మైలురాయి దాటింది. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఆయన యాత్ర సాగుతోంది. జగన్ నడుస్తోన్న దారి పొడవునా ప్రజలు కష్టాలు చెప్పుకున్నారు. చితికి పోయిన చేతి వృత్తుల వారు, చంద్రబాబు పాలనలో అధోగతిలో ఉన్న కులవృత్తుల వారు, టీడీపీ పాలనలో కష్టాలు పడుతున్న రైతులు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ అక్కచెల్లెమ్మలు… ఇలా దారి పొడవునా గోడును వెళ్లబోసుకున్న వారందరికీ జగన్ భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు అంటూ వైకాపా పత్రిక సాక్షి పేర్కొంది!
తనతో మాట్లాడిన పేదలకు జగన్ భరోసా కల్పిస్తూ… చిట్టి పిల్లలను బడికి పంపినందుకు ప్రతీయేటా తల్లికి రూ. 15 వేలు ఇస్తామన్నారు. మీ పిల్లలు ఇంజినీరింగ్, డాక్టర్ వంటి పెద్ద చదువులకు వెళ్తే ఆ ఫీజంతా తామే భరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. విద్యార్థులకు హాస్టల్ ఖర్చులకు ఏటా రూ. 20 వేలు ఇస్తామన్నారు. పెన్షన్ వయసును 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించి… ప్రతీనెలా రూ. 2 వేలు చొప్పున పింఛెను ఇస్తామన్నారు. 45 ఏళ్ల నుంచి 60 వయసున్న అక్కలకు భరోసాగా నిలిచేందుకు, ఆ వయసులో కష్టాలు పడకుండా.. తమ ప్రభుత్వం వచ్చిన రెండో యేట నుంచే ప్రతీ ఏడాది రూ. 19 వేలు చొప్పున ఇస్తామన్నారు. ఇలా నాలుగేళ్లపాటు రూ. 75 వేలు వారి చేతిలో పెడతామన్నారు. ఇలా ఎన్నో రకాలుగా మేలు జరగాలంటే మన ప్రభుత్వం అధికారంలోకి రావాలి, మనం అధికారంలోకి రావాలని దేవుడిని బాగా మొక్కండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు జగన్.
నిజానికి, జగన్ ఇస్తున్న హామీలు మొదట్నుంచీ ఇవే! సమస్యకు శాశ్వత పరిష్కారం అనే కోణంలో ఈ హామీల్లో కనిపించదు. తాత్కాలిక ప్రయోజనాలు కల్పించడమే పరిష్కారం అన్నట్టుగా ఉంటున్నాయి. ఇంకోటి… జగన్ ఇచ్చే హామీలన్నింటిలోనూ డబ్బులు పంచడం ఒక్కటే పరిష్కార మార్గం! చదివిస్తే… పదివేలిస్తా, జబ్బు చేస్తే ఇరవై వేలిస్తా, ఇంకోటి కావాలంటే ఇంకొన్ని వేలిస్తా.. ఇలాంటి హామీలే ఇస్తున్నారు. పేదలకు విద్యనందించాలంటే… నాణ్యమైన పాఠశాలల సంఖ్యను పెంచాలి. అదే సమయంలో, పేదలకు ఉపాధి మార్గాలకు కల్పించాలి. కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహించాలి. ఇలాంటి హామీలు ఇస్తే ఒక పేద కుటుంబానికి భరోసా కలుగుతుంది. అంతేగానీ… ప్రతీదానికీ డబ్బులు ఇచ్చేస్తా అంటే, ఆ డబ్బు ఖర్చు చేయడం ద్వారా వారి ప్రయోజనాలు నెరవేరుతాయని అనుకుంటే ఎలా..? పని కల్పించే వాతావరణం స్రుష్టించి… పనిచేయడానికి కావాల్సిన స్ఫూర్తినీ, నైపుణ్యాలను, ఆత్మ విశ్వాస స్థాయిని ప్రజల్లో పెంచగలిగే ఇచ్చే హామీలే సమస్యలకు అసలైన పరిష్కారాలు అవుతాయి.