ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర్నుంచీ చేతికి ఎముక లేదన్నట్టుగా జగన్ హామీలు ఇచ్చుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. దేవుడు దయవల్ల, ప్రజలు ఆశీర్వదిస్తే మనందరి ప్రభుత్వం వస్తుందనీ, అందరి కష్టాలూ తీరిపోతాయని చెబుతారు. విద్యార్థులు, మహిళలు, కుల సంఘాలు, వివిధ ఉద్యోగ సంఘాలు, కాంట్రాక్టు ఉద్యోగులు.. ఇలా ఎవరు ఎదురుపడితే వారికి హామీలు ఇస్తూనే ఉన్నారు. మన ప్రభుత్వం రాగానే అమలు చేసేస్తామని భరోసా కల్పిస్తూ పాదయాత్ర సాగిస్తున్నారు. సరే, ఆ హామీల అమలుకు రాష్ట్ర బడ్జెట్ సరిపోతుందా, నిధులు ఎక్కణ్నుంచీ తెస్తారు, ఇప్పటికే అన్ని రకాలుగా నిరాదరణకు గురౌతున్న రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు… ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకునే హామీలిస్తున్నారా అనేది తరువాతి చర్చ! ఇక, తాజా విషయానికొస్తే… ప్రస్తుతం జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది.
కౌతారం వద్ద కొంతమంది న్యాయవాదులను జగన్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికీ కొన్ని హామీలు ఇచ్చారు. పట్టా పుచ్చుకున్న న్యాయవాదికి, కొత్తగా పేరు నమోదు చేసుకున్నవారికి నెలకు రూ. 5 వేలు స్టైఫండ్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. కొత్త న్యాయవాదులు తమ వృత్తిలో నిలదొక్కుకునే విధంగా మూడేళ్లపాటు అండగా నిలిచే విధంగా స్టైఫండ్ అందిస్తామన్నారు. న్యాయవాదులు ఆకస్మికంగా మృతి చెందితే, వారికి కుటుంబానికి ప్రస్తుతం అందుతున్న పరిహారం రూ. 4 లక్షల నుంచి రూ. 10 లక్షలు చేస్తామని మరో హామీ ఇచ్చారు. అంతేకాదు, ఆంధ్రాలో హైకోర్టు నిర్మాణం పూర్తయ్యాక, న్యాయవాదులు కోరిక మేరకు కోర్టు పరిసర ప్రాంతాల్లోనే వారికి తక్కువ ధరలకు ఇళ్ల స్థలాలు అందిస్తామని ఇంకో హామీ ఇచ్చేశారు. ఇక, చివరిగా… న్యాయవాదులను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా ముంచేశారని ఆరోపించారు! అడ్వొకేట్లను కూడా మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే అన్నారు.
న్యాయవాదుల సమస్యలు సహేతుకమైనవే కావొచ్చు. కానీ, వాటిపై జగన్ స్పందనే కాస్త విడ్డూరంగా ఉంది. ఎందుకంటే, ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్తున్నది ఆయనే. అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఆయనే. ఒక్కో ఛార్జ్ షీటు మీద విడివిడిగా కాకుండా, తనపై ఉన్న అన్నింటినీ కలిపి ఒకేసారి విచారించాలంటూ వినతులిచ్చింది ఆయనే. పాదయాత్ర చేస్తున్నా కాబట్టి ప్రతీవారం కోర్టుకు హాజరు కావడం నుంచి మినహాయింపు కావాలని ప్రయత్నించింది ఆయనే. తాను ఇరుక్కున్న కేసుల నుంచి విముక్తి కోసం న్యాయవాదులు చుట్టూ చక్కర్లు కొడుతున్న జగన్… ఇప్పుడు న్యాయవాదుల సమస్యల్ని తానే తీర్చేస్తానంటూ హామీలివ్వడం.. మిస్ మ్యాచ్ అనిపిస్తోంది కదా!