జగన్కు నేరుగా పోలీసులు కౌంటర్ ఇస్తున్నారు. ఎస్పీ రత్నతో పాటు ఎస్ఐ కూడా జగన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మామూలుగా అయితే వాళ్లకు జగన్ కు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ వారిని జగన్ కించ పరిచారు. వారు తప్పు చేయకపోయినా నిందించారు. బట్టలూడదీస్తామని హెచ్చరించారు. దాంతో వారు స్పందించారు. అదే వ్యతిరేక భావం పనితీరులో చూపిస్తే వైసీపీకి మేలు జరుగుతుందా?
పోలీసులతో వైసీపీ అగ్రనేతలు చేసిన రాజకీయం దెబ్బకు చాలా మంది టీడీపీ నేతలు నష్టపోయారు. అయితే వారు ఎప్పుడూ పోలీసు వ్యవస్థ మొత్తాన్ని నిందించలేదు. పోలీసుల బట్టలిప్పదీస్తామని అనలేదు. తప్పు చేసిన వారిని వదిలి పెట్టేది లేదని మాత్రం హెచ్చరించేవారు. అధికారంలోకి వచ్చాక అదీ కూడా చేయడం లేదు. కానీ వైసీపీ నేతలు ముఖ్యంగా జగన్ పోలీసుల్ని రెచ్చగొడుతున్న వైనం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
పోలీసులు కూడా వైసీపీ నేతల్ని తమ వర్గ శత్రువులుగా ప్రకటించుకుంటే ఎవరికి నష్టం జరుగుతుంది ?. ప్రస్తుత ప్రభుత్వం చాలా వరకూ పోలీసులకు స్వేచ్చ ఇస్తోంది. రాజకీయంగా ఉపయోగపడాలని ఒత్తిడి చేయడం లేదు. శాంతి భద్రతలు ముఖ్యంగా పోలీసులకు విధులు నిర్వహించేలా అవకాశం కల్పిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ నేతలు కొంత మంది రెచ్చిపోతున్నా.. చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నారు. నిజంగా పోలీసులు వారిని కంట్రోల్ చేయాలనుకుంటే.. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవచ్చు.
పోలీసుల్ని జగన్ వ్యూహాత్మకంగా రెచ్చగొడుతున్నారో.. లేకపోతే ఆయన తత్వమే అంతనో వైసీపీ క్యాడర్ కు అర్థం కావడం లేదు. పోలీసులు తమపై పగబడితే నష్టపోయేది తామేనని వారు ఆందోళన చెందడం సహజం. జగన్ మాజీ ముఖ్యమంత్రి. ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఉండకపోవచ్చు..కానీ ఐదు సంవత్సరాలు సీఎంగా ఉన్న జగన్ వ్యవస్థల మీద కాస్తంతైనా తెలివిగా వ్యవహరిచాల్సిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.